Friday, September 27, 2024

సర్కార్ వారి పాట పది వేలు కధనానికి స్పందన.. పంచాయతీ కార్యదర్శి బదిలీ

మంగపేట, (ప్రభ న్యూస్) : ములుగు జిల్లా మంగపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి మాలోత్ హీరు నాయక్ ను జిల్లా పంచాయతీ అధికారులు బదిలీ చేశారు. మంగపేట మండలంలోని బోరు నర్సాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంబాబు సస్పెండ్ కావడంతో రెగ్యులర్ కార్యదర్శిని నియమించే వరకు మంగపేట గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మాలోత్ హీరు నాయక్ కు గతంలో బోరు నర్సాపురం గ్రామ పంచాయతీ ఇంచార్జి కార్యదర్శిగా ఉన్నతాధికారులు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఆ సమయంలో బోరు నర్సాపురం గ్రామ పంచాయతీకి సంబందించిన నర్సరీని నిబంధనలకు విరుద్దంగా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మిరప నారు సాగు చేసుకోవడం కోసం గ్రామంలోని కొండలు అనే రైతుకి పది వేల రూపాయలకు పంచాయతీ కార్యదర్శి హీరు నాయక్ లీజుకు ఇచ్చి పది వేల రూపాయలు తీసుకుని రశీదు ఇవ్వకపోవడమే కాకుండా అట్టి డబ్బులను నిబంధనల మేరకు గడువులోపు ఎస్టీఓలో జమ చేయలేదు.

- Advertisement -

ఈ విషయంపై ఇటీవల ఆంధ్రప్రభ దినపత్రికలో ‘‘ సర్కార్ వారి పాట పది వేలు ’’ అనే కధనం వచ్చిన తర్వాత సదరు రైతుకి రశీదు ఇచ్చి, అందుకు సంబందించిన నగదును ఎస్టీఓలో జమ చేసినట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ తో పాటు జిల్లా పంచాయతీ అధికారుల విచారణలో తేలింది.

వీటికి తోడు మండల కేంద్రమైన మంగపేట గ్రామ పంచాయతీలో వసూలు చేసిన ఇంటి పన్నులకు సంబందించిన నగదును ఎస్టీఓలో జమ చేయకుండా తన వద్దనే ( హ్యాండ్ క్యాష్ ) ఉంచుకోవడం, నిధుల దుర్వినియోగం, గ్రామంలో పారిశుధ్య పనులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని ఇలా పలు విషయాలలో మంగపేట గ్రామ పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ చేసినట్లు ములుగు డివిజనల్ లెవెల్ పంచాయతీ అధికారిణి ( డీఎల్పీఓ) స్వరూప ఇటీవల తెలిపారు.

ఈ విషయాలన్నింటినీ ఆంధ్రప్రభ దినపత్రిక వరుస కధనాలతో వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగపేట గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఉన్న హీరు నాయక్ ను ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామపంచాయతీ కార్యదర్శిగా బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement