హైదరాబాద్, ఆంధ్రప్రభ : అనుకున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ తీపికబురునందించింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం విభాగాల వారీగా ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే అలవెన్సులను భారీగా పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం విధిగా ఇచ్చే అలవెన్సుల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కార్ వెంటనే జీవోలను విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అలవెన్సులను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల ప్రయాణ భత్యం, కన్వెయన్స్‌ను 30శాతం, బదలీపై వెళ్లే ఉద్యోగులకు రవాణా అలవెన్సును కూడా భారీగా అంటే 30శాతం పెంచుతూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
సెలవుదినాల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లకు అదనంగా రూ.150 చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. షెడ్యూల్ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్షెటరీ అలవెన్సును 30శాతానికి పెంచారు. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్‌ను రూ.2వేలనుంచి రూ.3వేలకు పెంచుతూ నిర్ణయించారు. ఇళ్లు, కారు, మోటార్ సైకిల్ కొనుగోలుకు ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని కూడా పెరుతూ నిర్ణయించిన ప్రభుత్వం వివరాలను జీవోలో పేర్కొంది. ఈ క్రమంలో ఉద్యోగులు ఇండ్లు నిర్మించుకునేందుకు ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ.20లక్షలనుంచి రూ.30లక్షలకు పెంచింది. నాలుగు చక్రాల వాహనం కొనుగోలుకు అడ్వాన్స్ పరిమితిని రూ.6లక్షలనుంచి రూ.9లక్షలకు పెంచుతూ నిర్ణయించింది. మోటార్ సైకిల్‌కు రూ.80వేలనుంచి రూ.లక్షకు పెంచారు.
ఉద్యోగుల పిల్లల పెళ్లళ్లకు సంబంధించి అడ్వాన్స్ మొత్తాన్ని పెంచగా, కుమార్తె పెళ్లికి అడ్వాన్స్‌గా రూ. లక్షనుంచి రూ. 4లక్షలకు, కుమారుడి పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్‌ను రూ. 75వేలనుంచి రూ. 3లక్షలకు పెంచారు. రాష్ట్ర శిక్షణా ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్‌ను 30శాతానికి పెంచింది. గ్రేహౌండ్స్, ఇంటలిజెన్స్, ట్రాఫిక్, సీఐడీ, ఆక్టోబస్, యాంటి నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పనిచేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్ పే కూడా 2020 పే ప్రకారం వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. పెన్షనర్లు మరణిస్తే అందించే తక్షణ సాయం రూ. 20వేలనుంచి రూ. 30వేలకు పెంచారు. ప్రోటోకాల్ విభాగంలో విధులు నిర్వహించే అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులకు అదనంగా 15శాతం స్పెషల్ పే మంజూరీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.
మరింత ఉదారంగా..
త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన అనేకర పెండింగ్ సమస్యలు పరిష్కారం కానున్నాయని తెలుస్తోంది. రెవెన్యూతోపాటు పలు వాఖల్లో పదోన్నతుల అంశం త్వరలో సాకారం కానుంది. అన్ని శాఖల్లో ఉద్యోగులు కోరిన కీలకమైన అన్ని కోరికలను సీఎం కేసీఆర్ ఆమోదించే దిశగా సర్వం సిద్దమైంది. ఈ దిశలో ఉద్యోగ సమస్యలను, నూతన వేతన సవరణను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒక్కో శాతం ఫిట్‌మెంట్‌కు అయ్యే ఖర్చు, మొత్తం ఉద్యోగులు, వారి మూలవేతనం, స్థిరీకరణతో కలిగే ఆర్ధిక భారాలను ఆర్ధిక శాఖతో సీఎం కేసీఆర్ ఆరా తీశారు.
మధ్యంతర భృతిని వాయిదా వేయాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ ఉద్యోగులు పట్టుపడితే ఐఆర్ ప్రకటనకూ సిద్దంగా ఉన్నట్లుగా తెలిసింది. మార్కెట్ పరిస్థితులు, పెరిగిన ధరలను ప్రామాణికంగా తీసుకుని నిర్ణయించే పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ను ఈ దఫా కొత్త పద్దతిలో కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించనున్నారు. కాంట్రిబ్యూటరీ ఫించన్ విధానం ఎత్తివేతపై సాధ్యాసాధ్యాల పరిశీలన, అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని కూడా సీఎం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.