Thursday, November 21, 2024

విద్యార్థినులకు ఉచితంగా హెల్త్‌ కిట్లు.. 33 లక్షలు పంపిణీకి సర్కార్‌ ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఒకవైపు వైద్య ఆరోగ్య రంగాన్ని పట్టిష్ట పరిచేందుకు.. మరోవైపు ప్రభుత్వ బడుల్లో విద్యార్థినుల ఎన్‌రోల్‌మెంట్‌ పెంచేందుకు గానూ తెలంగాణ సర్కార్‌ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విధంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఉచితంగా అడోలసెంట్‌ హెల్త్‌ కిట్లు (శానిటరీ హెల్త్‌ అండ్‌ హైజెనిక్‌ కిట్లు) పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్‌ కాలేజీల్లోని 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు హెల్త్‌ కిట్లను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థినులకు ఈరకంగా లబ్ధి చేకూరనున్నది. ఇందుకు గానూ మొత్తం రూ.69.52 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. హెల్త్‌ కిట్లు కొనుగోలు, పంపిణీ కోసం ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ఈమేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని ఎనిమిది నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థినులకు ఈ హెల్త్‌ కిట్లను పంపిణీ చేయనున్నారు. ముందస్తుగా ఈ 2022-23 ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన ఆరు నెలల కోసం 11 లక్షల కిట్లను కొనుగోలు చేయనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మరో 22 లక్షల కిట్లను కొనుగోలు చేయనున్నారు. విద్యార్థినులకు అందించే ఈ కిట్‌లలో ఆరు శానిటరీ న్యాప్‌కిన్‌ ప్యాక్స్‌, ఒక బ్యాగ్‌, ఒక వాటర్‌ బాటిల్‌ ఉంటాయి. విద్యార్థినులకు హెల్త్‌ కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తామని ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన మేరకు ప్రస్తుతం కిట్ల కొనుగోలుకు సంబంధించిన పరిపాలన అనుమతులను మంజూరు చేసింది.

పెరగనున్న హాజరు శాతం…

ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థినుల హాజరు శాతం పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ఉచితంగా యూనిఫామ్స్‌, బుక్స్‌, మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కౌమర దశలో ఉండే బాలికలకు హెల్త్‌ అండ్‌ హైజెనిక్‌ కిట్లను సైతం పంపిణీ చేయాలని నిర్ణయించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం 15-24 వయస్సు ఉన్న యువతుల్లో సుమారు 32 శాతం మంది న్యాప్‌కిన్‌ లాగా క్లాత్‌ వినియోగిస్తున్నట్లు తేలింది. దీంతో మూత్రకోశ, గర్భాశయ తదితర సంబంధిత ఇన్‌ఫెక్షన్ల బారిన వారు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం హెల్త్‌ కిట్లను పంపిణీ చేయలని నిర్ణయించింది. రుతుక్రమం సమయంలో 14 నుంచి 19 ఏళ్ల వయస్సున్న బాలికలు శుభ్రత పాటించేందుకు ఇవి ఉపయోగపడతాయని ప్రభుత్వం పేర్కొంటోంది. దీంతో బాలికలు ఆరోగ్యవంతంగా ఉంటారంటుంది. అంతేకాకుండా చదువుపై కూడా మరింత శ్రద్ధ చూపించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఎన్‌రోల్‌మెంట్‌ కోసం స్పెషల్‌ డ్రైవ్‌…

బడిబయట, మధ్యలో చదువు ఆపేసిన పిల్లల కోసం స్పెషల్‌ ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ను పాఠశాల విద్యాశాఖ చేపడుతోంది. ప్రతి నెల ఫస్ట్‌ వర్కింగ్‌ డే నాడు ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో బాలకార్మికులను, బడి బయట ఉండే పిల్లలు, చదువును మధ్యలో ఆపేసిన పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్చుకుంటున్నారు. బడిఈడు పిల్లలు ఎవ్వరూ కూడా చదువుకు దూరంగా ఉండొద్దనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement