న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న అరబిందో గ్రూప్ డైరక్టర్ శరత్చంద్ర రెడ్డి అప్రూవర్‌గా మారారు. అప్రూవర్‌గా మారిన విషయాన్ని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టుకు తెలియజేస్తూ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన దరఖాస్తును న్యాయస్థానం ఆమోదించింది. శరత్చంద్ర రెడ్డి అప్రూవర్‌గా మారి ఇచ్చే సమాచారంతో ఈడీ మరికొందరు ముఖ్యులను అరెస్టు చేయనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడానికి తగినన్ని ఆధారాలను అటు సీబీఐ, ఇటు ఈడీ ఇప్పటి వరకు సేకరించలేకపోయింది.
కవిత బినామీగా దర్యాప్తు సంస్థలు చెబుతున్న అరుణ్ రామచంద్రన్ పిళ్లైని ఇప్పటికే అరెస్టు చేయగా, ఆమె వ్యాపార లావాదేవీలకు ఆడిటర్‌గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ నిందితుల జాబితాలో చేర్చి చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. అయితే ఈ ఇద్దరిలో అరుణ్ పిళ్లై కవితకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నానంటూ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఇదిలా ఉంటే కవితను ఈడీ మూడు పర్యాయాలు పిలిపించి ప్రశ్నించింది. ఆ తర్వాత మళ్లీ కేసులో ఎలాంటి కదలిక కనిపించలేదు. అయితే ఇప్పుడు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న శరత్చంద్ర రెడ్డి అప్రూవర్‌గా మారడంతో మళ్లీ కవిత వ్యవహారంలో కదలిక మొదలవుతుందని తెలుస్తోంది. ఆడిటర్ బుచ్చిబాబును సైతం పలుమార్లు పిలిపించి వాంగ్మూలాలు నమోదు చేసుకున్న ఈడీ, ఇప్పుడు శరత్చంద్ర రెడ్డి ఇచ్చే సమాచారాన్ని కూడా కలుపుకుని కవిత చుట్టూ ఉచ్చు బిగించే అవకాశం ఉంది. సౌత్ గ్రూపు పేరిట రూ. 100 కోట్ల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్‌కు అందజేయడంలో శరత్చంద్ర రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడీ తన చార్జిషీట్లో పేర్కొంది.
అందుకు ప్రతిఫలంగా సమీర్ మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్స్ సంస్థలో శరత్‌కు వాటా ఇచ్చారని, ట్రైడెంట్, ఆర్గోనామిక్స్, అవంతిక కాంట్రాక్టర్స్ పేరుతో శరత్ చంద్ర రెడ్డికి చెందిన కంపెనీలు ఢిల్లీలో రిటైల్ జోన్స్ ను చేజిక్కించుకుని వ్యాపారం చేశాయని ఆరోపించింది. సౌత్ గ్రూపులో శరత్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, మాగుంట కుటుంబ సభ్యులు ప్రధాన వాటా కలిగి ఉన్నారని చెబుతున్న దర్యాప్తు సంస్థ వీరంతా కలిసి వివిధ స్టార్ హోటళ్లలో ఆప్ నేతలతో మంతనాలు సాగించారని చెబుతోంది. ఇప్పుడు శరత్ అప్రూవర్‌గా ఇచ్చే వాంగ్మూలాల ఆధారంగా కవిత పాత్రను కేసులో నిర్థరించనున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.