Saturday, November 23, 2024

సంస్కృత భాష మన వారసత్వ సంపద.. అభ్యాసం ప్రజా ఉద్యమంగా మారాలి: ఉప రాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతదేశ ఆత్మను అధ్యయనం చేసే విషయంలో సంస్కృత భాషను నేర్చుకోవడం అత్యంత ఆవశ్యకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సంస్కృత భాషను ప్రతి ఒక్కరికీ చేరవేయడాన్ని ప్రజాఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. శనివారం బెంగళూరులోని కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం 9వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి, సంస్కృత భాష పరిరక్షణ అవసరాన్ని నొక్కిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా వస్తున్న మార్పులను సద్వినియోగం చేసుకుంటూ సంస్కృతంతో పాటు ఇతర ప్రాచీన భారతీయ భాషలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రాచీన రాతప్రతులు, శిలాశాసనాలు, శాసనాల డిజిటలీకరణ, వేదాధ్యయన రికార్డింగ్, తత్సంబంధిత పుస్తకాల ప్రచురణలను చేపట్టడంతో పాటుగా సంస్కృత భాష్యాలను సులువుగా నేర్చుకోవడంతోపాటు, అర్థం చేసుకునేందుకు వీలైన అంశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తత్వ, మత సంబంధమైన అంశాలను తెలుసుకునేందుకు మాత్రమే సంస్కృతాన్ని పరిమితం చేయకూడదని, ఆయుర్వేదం, యోగ, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు, ధాతుశోధన శాస్త్రం (మెటలర్జీ), జ్యోతిష్యశాస్త్రం, కళలను అధ్యయనం చేసేందుకు కూడా సంస్కృతం అవసరం ఎంతగానో ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు.

ప్రతి విద్యార్థి భారతీయ విజ్ఞాన ఖనిని వెలికితీసి తమ జీవితాలను మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు సంస్కృతాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు. ప్రాచీన భాషల పరిరక్షణ విషయంలో కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం పోషిస్తున్న పాత్రను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. భాషా పరిశోధనకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తూ సమకాలీన ప్రపంచానికి అవసరమైన అంశాలను అందుకునే దిశగా ఈ పరిశోధనలను జరగాలని ఆయన సూచించారు. తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా దక్కడం ఆయా భాషల ప్రాధాన్యతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, బసవేశ్వరుడు వంటి ఎందరో మహనీయుల పాదస్పర్శతో పునీతమైన కర్ణాటకలో జ్ఞాన, తత్వనిధికి కొరతలేదని, దీన్ని వెలికితీయడంపై సంస్కృత విశ్వవిద్యాలయం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఈ సందర్భంగా ఆచార్య ప్రద్యుమ్న, డాక్టర్ వీఎస్ ఇందిరమ్మ, విద్వాన్ ఉమాకాంత భట్‌లకు గౌరవ డాక్టరేట్లను ఉపరాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్, విశ్వవిద్యాల ఉపకులపతి ప్రొఫెసర్ కేఈ దేవనాథన్ సహా పాలకమండలి సభ్యులు, బోధనాసిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement