విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి జై కొడుతున్నారు. తొలి ఆట నుంచే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తన దూకుడు చూపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది.
తొలి రోజు ఈ చిత్రం రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి.. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధికంగా మొదటి రోజు కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక రెండో రోజు రూ.32 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా.. మూడో రోజు రూ.29 కోట్ల మొత్తాన్ని కలెక్ట్ చేసింది. మొత్తంగా మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర బృందం తెలియజేసింది.