సంక్రాంతి పండుగ సందర్భంగా… బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను, రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది.
టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
టీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఆంధ్రపదేశ్, కర్ణాటకకు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లు అన్నీ ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎస్ లతో పాటు దిల్‌సుఖ్ నగర్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్.బీ.నగర్ లతో పాటు జంట నగరాలలోని వివిధ శివారు కాలనీల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. నిత్యం 40 వేల నుంచి 50 వేల మంది బస్సుల ద్వారా ప్రయాణికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్లాట్‌ఫాంల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక రైళ్లు.. రైల్వేస్టేషన్లలో రద్దీ…
రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. దక్షిణ మధ్య రైల్వేశాఖ సంక్రాంతి పండుగల సందర్బంగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు రైళ్ల సమయవేళలకు ముందుగానే స్టేషన్‌కు చేరుకొని స్టేషన్ వద్ద పడిగాడుపులు కాస్తున్నారు. రాత్రి 10, 11 గంటలకు వెళ్లే రైళ్లకు సైతం.. సాయంత్రం ఆరుగంటలకే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. దీంతో రద్దీ భారీగా పెరిగిపోయింది.