- కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శగా ఉన్న మల్హోత్రా
- తదుపరి గవర్నర్‌గా నియమించిన మోదీ సర్కారు
- నిన్న పదవీ విరమణ చేసిన శక్తికాంత దాస్
ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్బీఐ 26వ గవర్నర్‌గా ఆయన ఇవ్వాళ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి దాకా గవర్నర్‌గా సేవలందించిన శక్తికాంత దాస్ పదవీకాలం మంగళవారం (డిసెంబర్ 10)తో ముగిసింది. ఈ క్రమంలోనే ఆయన స్థానంలోకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రాను మోదీ సర్కారు తీసుకొచ్చింది. నిన్న శక్తికాంత దాస్ పదవీ విమరణ చేయడంతో.. ఆర్బీఐ తదుపరి గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. నేటి నుంచి మూడేండ్లపాటు ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు.
పలు శాఖల్లో ఉన్నతాధికారిగా..
కాగా, ఐఐటీ కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్‌ను పూర్తిచేసిన సంజయ్ మల్హోత్రా.. అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీని సైతం పొందారు. 33ఏండ్ల తన కెరియర్‌లో ఎన్నో ప్రభుత్వ రంగ శాఖల్లో మరెన్నో బాధ్యతల్ని నిర్వహించారు. రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. విద్యుత్తు, ఆర్థిక, పన్నులు, ఐటీ, గనులు తదితర రంగాల్లో సమర్థవంతంగా పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తుండగా, అంతకుముందు ఆర్థిక సేవల కార్యదర్శిగా ఉన్నారు. ముఖ్యంగా ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించిన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించారు.
శక్తికాంత దాస్ పదవీ విరమణ..
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం పదవీ విరమణ చేశారు. రిజర్వ్ బ్యాంక్ 25వ గవర్నర్‌గా ఆరేండ్లు పనిచేసిన ఆయన.. అప్పటి గవర్నర్ ఊర్జిత్ పటేల్ అనూహ్య రాజీనామాతో 2018 డిసెంబర్ 12న ఈ పదవిలోకి వచ్చారు. 1980 తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి అయిన దాస్.. కేంద్ర ఆర్థిక శాఖలోని వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ క్రమంలోనే 8 కేంద్ర బడ్జెట్లలో భాగస్వాములయ్యారు. ఇక అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్‌లో రెండుసార్లు టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా దాస్ అగ్రస్థానాల్లో నిలవడం విశేషం.