ఆర్‌బిఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలం మూడేళ్లు ఉంటుందని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం పదవీ విరమణ చేయనుండగా… మల్హోత్రా పదవీ కాలం 11వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
కాగా, మల్హోత్రా రాజస్తాన్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిగా పని చేశారు. 1990 లో ఐఏఎస్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ఈయన.. పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గనులు మొదలైన అనేక రంగాలలో పనిచేశారు. భారత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శి పదవిని నిర్వహించారు. ప్రస్తుతం మల్హోత్రా ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవిన్యూ కార్యదర్శిగా పదవిలో ఉన్నారు.