తిరుపతి: తిరుమల, తిరుపతి లో గత ఐదారు రోజులుగా పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మె సుఖాంతమైందని శాసన సభ్యులు, టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం రాత్రి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, సులబ్ సంస్థ తరపున టీటీడీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు ముందస్తు నోటీసు ఇవ్వకుండా సమ్మెకు దిగడంతో లక్షలాదిమంది భక్తులు ఇబ్బందులు పడ్డారన్నారు. దీంతో టీటీడీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుందన్నారు.
సులబ్ సంస్థ కాంట్రాక్టు రద్దు చేసి మొత్తం ఆరు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పని అప్పగించిందని ఆయన తెలిపారు. గత 15 నుండి 20 ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులు నష్ట పోతారనే ఉద్దేశంతో తాను, స్థానిక శాసన సభ్యుడు భూమన కరుణాకర రెడ్డి చర్చించుకుని కార్మికులకు న్యాయం జరిగేలా సమస్య పరిష్కరించాలని నిర్ణయించుకున్నామన్నారు. కార్మికుల విజ్ఞప్తి మేరకు తాను వారి ప్రతినిధిగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడానన్నారు. కొత్త కాంట్రాక్టర్లు ఇప్పటి దాకా పని చేసిన పారిశుధ్య కార్మికులనే నియమించుకోవాలని, వారు కాకుండా మిగిలితే మాత్రమే కొత్తవారిని నియమించుకోవాలనే ప్రతిపాదనకు ఈవో అంగీకరించారన్నారు. అలాగే వారికి వారంలో ఒక రోజు సెలవు, పి ఎఫ్, ఈ ఎస్ ఐ చెల్లించి దర్శనం, లడ్డూ సదుపాయాలు కల్పించడానికి కూడా ఈవో పెద్ద మనసుతో అంగీకరించారని భాస్కర్ రెడ్డి వివరించారు. పారిశుధ్య కార్మికులు కూడా భవిష్యత్తులో భక్తులకు ఇబ్బంది కలిగించకుండా పని చేస్తామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.
అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వినాయక నగర్ గ్రౌండ్ లో నిరసన వ్యక్తం చేస్తున్న పారిశుధ్య కార్మికులకు టీటీడీ యాజమాన్యం అంగీకరించిన సదుపాయాలను వివరించారు. పారిశుధ్య కార్మికుల నాయకులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో భక్తులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించబోమని అన్నారు.