Thursday, November 21, 2024

ఎంజీఎం ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. బిల్డింగ్ ఎక్కిన కార్మికులు

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీతాలు చెల్లించడం లేదంటూ దీక్షకు దిగిన శానిటేషన్ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తోటి కార్మికులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఈ క్రమంలో కొందరు కార్మికులు హాస్పిటల్ బిల్డింగ్ ఎక్కారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత వారం రోజులుగా దీక్ష చేస్తున్నా, ఎంతమందిని అరెస్ట్ చేసినా కనీస వేతనం ప్రకటించే వరకు దీక్ష కొనసాగిస్తామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. అధికారులు చర్చలకు పిలవకుండా కార్మికులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేయడం వల్లే తోటి కార్మికులు బిల్డింగ్ ఎక్కి నిరసన తెలుపుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇప్పించేలా సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రెండు మూడు దఫాలుగా చర్చలు జరిపినా కార్మికులు సమస్య పరిష్కారం కాలేదని, ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కల్పించుకుని వీరి సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, టీ పీసీసీ కార్యదర్శులు కొత్తపల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాష్, టీ పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ దుబ్బా శ్రీనివాస్, జిల్లా మైనారిటీ సెల్ ఛైర్మన్ మహమ్మద్ ఆయుబ్, జిల్లా ఎస్పీ డిపార్టుమెంటు ఛైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, స్థానిక డివిజన్ కాంగ్రెస్ అద్యక్షుడు గన్నారపు సంగీత్ కుమార్, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూచన రవీందర్, జన్ను వివేక్, బాల్య కుమార్, కొత్తూరు రాజేష్, మహమ్మద్ జామీరుద్దిన్, యకుబ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement