Wednesday, November 20, 2024

గోదావరిని తోడేస్తున్న ఇసుక తోడేళ్లు..

  • వారి పనులను అడ్డగిస్తే అంతే సంగతి
  • గోదావరి నదిపై అనుమతి లేకుండా అప్రోచ్ రోడ్ నిర్మాణం
  • య‌థేచ్ఛ‌గా జయశంకర్ జిల్లా నుండి మంచిర్యాల జిల్లాకు తరలుతున్న అక్రమ ఇసుక రవాణా
  • అడ్డుకునేందుకు వెళ్లిన తహసీల్దార్ కు బెదిరింపులు
  • పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయ‌నున్న తహసీల్దార్..?

ప్రభ న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి/మహాదే వపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. వారి పనులకు, అక్రమ దందాకు అడ్డు తగిలితే ఎంతటివారినైనా వదిలేదిలేదని హెచ్చరిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాలేశ్వరం గోదావరి నదిపై ఇసుకసురులు పడి అక్రమ రవాణా చేసి.. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ఇక్కడి ఇసుకను పర్మిషన్ లేకుండానే పక్క జిల్లా మంచిర్యాలకు య‌థేచ్ఛ‌గా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా గోదావరి నదిలో రాత్రికి రాత్రే కిలోమీటర్ మేరా అప్రోచ్ రోడ్ నిర్మించి జయశంకర్ జిల్లాలోని సహజ వనరులను హద్దులు దాటించి పక్క జిల్లాకు తరలించుకుపోతున్నారు. సమాచారం అందుకున్న మహాదేవపూర్ తహసీల్దార్ శంకర్ బుధవారం ఉదయం ఫీల్డ్ సందర్శనకు వెళ్లగా ఇసుక మాఫియా భరితెగించింది. పనులు ఆపాలని సూచించిన తహసీల్దార్ పైనే బెదిరింపులకు పాల్పడింది. అంతటితో ఆకుండా సదరు ఇసుక మాఫియా డాన్ తహసీల్దార్ శంకర్ కు వాట్సాప్ కాల్ చేసి అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. దీంతో సదరు ఇసుక డాన్ పై తహసీల్దార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement