Saturday, November 23, 2024

రాష్ట్ర సరిహద్దులో ఇసుక పంచాయితీ.. కర్నాటక నుంచి తెలంగాణలోకి..

వికారాబాద్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి : రాష్ట్ర సరిహద్దులో ఏటా వేసవి కాలంలో సరిహద్దు సమస్య తలెత్తుతోంది. ఇసుక రవాణాతో ఈ సమస్య తెరపైకి వస్తోంది. జిల్లాలోని తాండూరు నియోజకవర్గ పరిధిలోని బషీరాబద్‌ మండలంలోని అనేక గ్రామాలు రాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. ఈ గ్రామాల పక్క నుంచి కాగ్నా నది ప్రవహిస్తుంది. ఈ నది కూడా కొంత భాగం మన రాష్ట్ర పరిధిలో ఉండగా మరికొంత భాగం కర్ణాటక పరిధిలో ఉంది. నదిలో సరిహద్దులు లేకపోవడం వ్యాపారులకు వరంగా మారింది. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో దాదాపు నాలుగు నెలల పాటు కాగ్నా నదిలో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతాయి. కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ పనులకు కాగ్నా నది నుంచి ఇసుక కేటాయింపులు చేస్తున్నారు. అక్కడి గనుల శాఖ అధికారుల సిఫార్సుతో జిల్లా కలెక్టర్‌ ఇసుక కేటాయింపులు చేస్తున్నారు. లీజులు పొందిన కర్ణాటక వ్యాపారులు మన రాష్ట్ర సరిహద్దులోని కాగ్నా నదిలోకి చొచ్చుకవచ్చి ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు.

చాలా సందర్భాలలో సరిహద్దులోని ఇరు గ్రామాలకు చెందిన ప్రజలు ఘర్షణ కూడా పడ్డారు. జిల్లా కలెక్టర్‌తో మొదలుకొని ఆర్డీవో, తహసీల్దార్‌ లాంటి అధికారులు సరిహద్దు సమస్య పరిష్కారానికి చొరవ చూసినా ఫలితం కనిపించడం లేదు. మన పరిధిలో ఉన్న కాగ్నా నది నుంచి ఇసుక తరలిస్తున్న టిప్పర్లను..యంత్రాలను రెవెన్యూ, పోలీసు అధికారులు సీజ్‌ చేసిన ప్రతిసారి పెద్ద ఎత్తున సరిహద్దు సమస్య తెరపైకి వస్తోంది. కర్ణాటక రాష్ట్ర పరిధిలోని ఇసుక తరలింపు కాంట్రాక్టర్లు, అధికారులు, పోలీసు శాఖ కలిసిపోవడంతో ఇసుక తరలింపును అడ్డుకున్న ప్రజలు, నేతలు, అధికారులపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో ఎవరు కూడా ఇసుక తవ్వకాల జోలికి వెళ్లడం లేదు. సరిహద్దులోని కాగ్నా నదిలో ఇరు రాష్ట్ర హద్దులను ఖరారు చేసేందుకు పలుమార్లు సర్వే చేసి హద్దు రాళ్లను పాతించారు. వర్షాకాలంలో ఈ హద్దు రాళ్లు నీటి ప్రవాహంకు కొట్టుకపోవడంతో తిరిగి సమస్య మొదటికి వస్తోంది.

ప్రస్తుత వేసవిలో కూడా కర్ణాటక రాష్ట్ర అధికారులు కాగ్నా నది నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతులు జారీ చేశారు. దీంతో కాంట్రాక్టర్లు భారీ యంత్రాలను రంగంలోకి దించి టిప్పర్ల సహాయంతో ఇసుకను తోడేస్తున్నారు. హద్దులు దాటి సాగిస్తున్న ఇసుక తవ్వకాలపై స్థానిక ప్రజలు ఫిర్యాదు చేయడంతో బషీరాబాద్‌ మండల అధికారులు ఆపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. కొద్ది రోజుల క్రితం ఇసుకను తరలిస్తున్న వాహనాలను సీజ్‌ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గత వారం రోజుల నుంచి ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. అప్పటికే పొరుగు రాష్ట్ర ఇసుక కాంట్రాక్టర్లు బషీరాబాద్‌ మండల పరిధిలోని క్యాద్గిర, గంగ్వార్‌, జీవన్గి గ్రామాల వరకు ఉన్న కాగ్నా నదిలోకి చొచ్చుకవచ్చి ఇసుకను తోడేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement