Tuesday, November 26, 2024

భూమ్మీద ఇసుక సంక్షోభం..

న్యూయార్క్‌, ప్ర‌భ‌న్యూస్ : ప్రపంచం త్వరలో మరో పెను సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నది. ఇసుక కొరత రూపంలో ఈ సంక్షోభం మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నదని యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌ఈపీ) నివేదిక హెచ్చరిస్తున్నది. ప్రపంచంలో నీరు తరువాత అత్యధికంగా ఉపయోగించే సహజ వనరు ఇసుకే. ఇసుక వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి నియంత్రణలు లేవు. ఇసుక వనరులపై మెరుగైన నియంత్రణ లేకపోతే భవిష్యత్తులో భూమండలం మీద ఇసుక రేణువే కనిపించదని ఆ నివేదిక వివరిస్తున్నది. వందల వేల ఏళ్ల భౌగోళిక ప్రక్రియ ద్వారా ఇసుక ఏర్పడుతుందనీ, అయితే మనం దాని ఆవిర్భావం కంటే వేగంగా ఇసుకను వినియోగించుకుంటున్నామని యూఎన్‌ఈపీ ఎకానమీ విభాగ అధిపతి షీలా అగర్వాల్‌ ఖాన్‌ తెలియజేశారు. ఇప్పటికైనా ఇసుక వినియోగంపై నియంత్రణలు పెట్టగలితే… ఈ ముప్పునుంచి బయటపడవచ్చునని తెలియజేశారు. ఈ నివేదికకు షీలా అగర్వాల్‌ ముందుమాట రాశారు. ఇళ్ల నిర్మాణంతో పాటు, గ్లాస్‌, కాంక్రీట్‌ తయారీలో ఇసుకను ఎక్కువగా ఉపయోగిస్తారు.

గత రెండు దశాబ్దాలలో ఇసుక వినియోగం మూడు రెట్లు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి 50 బిలియన్‌ టన్నుల ఇసుకను వినియోగిస్తున్నాం. అంటే ప్రతి మనిషి రోజుకు 17 కిలోల ఇసుకను వినియోగిస్తున్నట్లు లెక్క. దీని వల్ల నదులు, తీరప్రాంతాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. పర్యావరణ పరంగాకూడా అనేక సమస్యలు వస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో ఇసుక కీలక పాత్ర పోషిస్తున్నది. తుపానుల నుంచి రక్షణ కల్పిస్తుంది. వేలాది జీవులకు ఆవాసంగా ఉపయోగపడుతుంది. భూమి కోతనుంచి ఇసుకే రక్షిస్తుంది. సముద్ర తీరాలనుంచి ఇసుక వెలికి తీయడాన్ని నిషేధించాలని ఈ నివేదిక సిఫారసు చేసింది. అతిగా ఇసుక వెలికితీయడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయని, ఇందుకు ఆగ్నేయాసియాలోని మెకాంగ్‌ నదీ తీర ప్రాంతమే మంచి ఉదాహరణ అని తెలిపింది. ఈ నది వెంట ఉన్న ఇసుకను తరలించడంతో డెల్టా మునిగిపోయింది. ఒకప్పుడు సారవంతమైన నేలలు ఇప్పుడు లవణీకరణం పొందాయి. శ్రీలంకలో నదులలోకి సముద్ర జలాల చొచ్చుకొస్తున్నాయని ఆ నివేదిక కొన్ని ఉదాహరణలు ఇచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement