పూరి – క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంతా క్లాజ్‌ను రూపొందించారు. ఉల్లిపాయలు,ఇసుక సహాయంతో సుదర్శన్ పట్నాయక్ ఈ శాంతా క్లాజ్‌ని తీర్చిదిద్దారు. పట్నాయక్ తనదైన శైలిలో ప్రజలకు సందేశం ఇచ్చారు.
శాంతాక్లాజ్ సైకత శిల్పం ముందు క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాయడంతోపాటు ఈ భూమిని సస్యశ్యామలం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ భారీ సైకత శిల్పం తయారీకి రెండు టన్నుల ఉల్లిని వినియోగించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. ప్రతి సంవత్సరం, క్రిస్మస్ సందర్భంగా పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో విభిన్న శిల్పాలను రూపొందించడానికి ప్రయత్నిస్తుంటానని పట్నాయక్ చెప్పారు.
ఈసారి ఉల్లిపాయలు, ఇసుకతో ప్రపంచంలోనే అతిపెద్ద శాంతా క్లాజ్‌ని తయారుచేశానని తెలిపారు.
ఈ శాంతాక్లాజ్ సైకత శిల్పం 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు.ఈ సైకత శిల్పం తయారు చేసేందుకు ఎనిమిది గంటల సమయం పట్టిందని పట్నాయక్ తెలిపారు. కాగా వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియా ఈసైకత శిల్పాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంగా ప్రకటించింది.