హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు సంస్థ అందజేయనుంది. మేడారం మహా జాతర ఈ నెల 21 నుంచి 24వ తేది వరకు జరుగుతుండగా.. ఈ నెల 14 నుంచి 25వ తేది వరకు ఆన్‌లైన్/ఆఫ్ లైన్‌లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పించింది.
భక్తులు రూ.299 చెల్లించి సమీపంలోని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్(కార్గో) కౌంటర్లలో, పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రత్యేక లింక్, పేటిఎం ఇన్‌సైడర్ యాప్‌లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని ఆర్డర్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ బుకింగ్ సమయంలో భక్తులు తమ చిరునామా, పిన్‌కోడ్, ఫోన్ నంబర్ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించింది.
రవాణాశాఖ మంత్రి ప్రభాకర్ సూచన మేరకు అమ్మవార్లను దర్శించుకోలేని భక్తులకు ప్రసాదం అందజేయనున్నట్లు ఎండీ వీసీ సజ్జనార్ ఈసందర్భంగా తెలిపారు. ఈ బుకింగ్ సదుపాయం తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. మేడారం జాతర అనంతరం నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని సంస్థ అందజేస్తుందన్నారు. మరిన్ని పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-69440069, 040-69440000, 040-23450033 సంప్రదించాలని ఆయన సూచించారు.