Monday, November 25, 2024

Delhi | ములుగులో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ.. 889.07 కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విభజన హామీల్లో ఒకటైన గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం యూనివర్సిటీకి ‘సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం’గా నామకరణం చేసింది. ఈ మేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం – 2009లో సవరణలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2104లోని 13వ షెడ్యూల్‌లో పొందుపరిచిన హామీల్లో గిరిజన విశ్వవిద్యాలయం ఒకటి.

- Advertisement -

యూనివర్సిటీ ఏర్పాటు కోసం అవసరమైన ప్రదేశాన్ని గుర్తించి, స్థలాన్ని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడంలో జాప్యం జరిగిందని, అందుకే ఈ హామీని ఇంత ఆలస్యంగా అమలు చేయాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, సహాయమంత్రి మురుగన్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ ఠాకూర్ గిరిజనులతో పాటు గిరిజనేతరులకు కూడా ఆరాధ్యదైవమైన వనదేవతలు సమ్మక్క-సారక్క పేరిట యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. యూనివర్సిటీ భవనాల నిర్మాణం, నిర్వహణ కోసం తక్షణమే రూ. 889.07 కోట్లు నిధులను సర్దుబాటు చేస్తున్నట్టు వెల్లడించారు.

ట్రైబల్ యూనివర్సిటీ కారణంగా ఆ ప్రాంతంలోని గిరిజన-ఆదివాసీల విద్యావకాశాలు మెరుగుపడతాయని, నాణ్యమైన ఉన్నత విద్యను అందుకుంటారని కేంద్ర మంత్రులు చెప్పారు. అలాగే రాష్ట్రంలో గిరిజన కళలు, సంస్కృతి, సంప్రదాయాలపై బోధన, పరిశోధనకు ఆస్కారం ఉంటుందని అన్నారు. ప్రాంతీయ అసమానతలను తొలగించేందుకు కూడా ఈ యూనివర్సిటీ వేదికగా మారుతుందని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement