Friday, November 22, 2024

గ్రూప్‌-2, గ్రూప్‌-3లోని పోస్టులన్నిటికీ ఒకే నోటిఫికేషన్‌.. సన్నాహాలు చేస్తున్న టీఎస్‌పీఎస్‌సీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్‌సీ ఒకదాని తరువాత మరోకటి ఉద్యోగాల భర్తీ ప్రకటనలు వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-2, 3, 4 నోటిఫికేషన్‌ల జారీపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. అయితే ఏ పోస్టులను ఏ నోటిఫికేషన్‌లో కలిపి ఇవ్వాలా? లేదా విడివిడిగా ఇవ్వాలా? అనే దానిపై కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే గ్రూప్‌-2 పోస్టులతో పాటు గ్రూపు-3 పోస్టులను కలిపి ఒకే నోటిఫికేషన్‌ ద్వారా భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ ప్రభుత్వ ఆదేశాల మేరకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గ్రూప్‌-2లో 582 పోస్టులు, గ్రూప్‌-3లో 1373 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఈ రెండింటికి విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేయడం కంటే, ఈ రెండు గ్రూపుల్లోని పోస్టులన్నింటినీ కలిపి ఒకే నోటిఫికేషన్‌ వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ నేపథ్యంలో జీఏడీ విభాగం ఇప్పటికే టీఎస్‌పీఎస్‌సీకి ప్రతిపాదనలు రూపొందించి పంపించినట్లుగా తెలిసింది.

దీనిపై కమిషన్‌ అధికారులు ముమ్మర కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. గ్రూప్‌-3లో సీనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ సిస్టెంట్‌, ఆడిటర్‌, టైపిస్ట్‌ వంటి పోస్టులు ఉండగా, గ్రూప్‌-2లో గ్రేడ్‌-3 పురపాలక కమిషనర్లు, ఏసీటీవో, సబ్‌రిజిస్ట్రార్‌-గ్రేడ్‌2, ఆబ్కారీ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, పంచాయతీ విస్తరణాధికారి, సహాయ రిజిస్ట్రార్‌ తదితర పోస్టులున్నాయి. వీటన్నింటినీ కలిపి ఒకే నోటిఫికేసన్‌ వేయాలా? లేక అందులోని కొన్ని పోస్టులను గ్రూప్‌-2లో కలిపి, మిగతా వాటికి మరో నోటిఫికేషన్‌ వేయాలా దానిపై కసరత్తులు చేస్తున్నట్లుగా తెలిసింది. అయితే మొదట గ్రూప్‌-2, 3 కలిపి ఒక నోటిఫికేషన్‌ వస్తుందా? లేకుంటే గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ వెలువడుతుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

గ్రూప్‌-1కు భారీగా దరఖాస్తులు…

గ్రూప్‌-1 పోస్టులకు ఉద్యోగార్థుల నుంచి మంచి స్పందన వస్తోంది. శనివారం రాత్రి వరకు 1,05,740 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నాడు మరో ఐదు వేల లోపు దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు ఈనెల 31 వరకు అవకాశముండటంతో భారీగా దరఖాస్తులొచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గ్రూపుల వారీగా పోస్టుల వివరాలు..

- Advertisement -

గ్రూప్‌ 1-503
గ్రూప్‌2-582
గ్రూప్‌3-1373
గ్రూప్‌4-9168

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement