నోరు మంచిదైతే.. ఊరు మంచిది అవుతుందని పెద్దలు చెప్తుంటారు. కానీ నోరు పెద్దది అయితే గిన్నిస్ రికార్డు సాధించవచ్చని ఓ యువతి నిరూపించింది. అమెరికాకు చెందిన సమంత రామ్స్డెల్ అనే యువతి తన నోరుతోనే ఫన్నీ వీడియోలు చేసి టిక్‌టాక్ ద్వారా అందరికీ పరిచయం అయింది. దీంతో ఆమె ఫాలోవర్లు గిన్నిస్ రికార్డుకు ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సమంత దంత వైద్యుడి దగ్గరకు వెళ్లి తన నోటిని మెజర్ చేయించింది. సమంత నోటి పొడవు, వెడల్పులను లెక్కించడానికి డిజిటల్ కాలిపర్లను ఉపయోగించగా 6.52 సెం.మీ ఉందని తేలింది. దీంతో ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కోసం దరఖాస్తు చేసుకుంది.
దీంతో సమంతకు ప్రపంచంలోనే అతిపెద్ద నోరు కలిగిన మహిళగా గిన్నిస్ నిర్వాహకులు సర్టిఫికెట్ అందజేశారు. అయితే సమంత ఫ్యామిలీలో ఆమె అంత పెద్ద నోరు ఎవ్వరికీ లేకపోవడం గమనార్హం. సమంత నోరు ఎంత పెద్దగా ఉంటుందంటే ఒక ఆపిల్ మొత్తం తాను నోట్లో పెట్టుకుంటుంది. అంతేకాకుండా నాలుగు సింగిల్ చీజ్ బర్గర్లను ఒకేసారి తినేయగలదు. అతిపెద్ద పరిమాణంలోని ఫ్రెంచ్ ఫ్రైస్ను ఒకేసారి నోట్లో పెట్టుకోగలదు. చిన్ననాటి నుంచి పెద్ద నోరు కారణంగా పలువురు అపహాస్యం చేసినా నవ్వులు పంచుతూ టిక్ టాక్ వీడియోలు చేసేది. అలా పేరు తెచ్చుకున్న ఆమెను గిన్నిస్ రికార్డు వరించింది.
ఈ వార్త కూడా చదవండి: ఇంటి పెరట్లో రూ.745 కోట్లు విలువగల నీలమణుల రాయి