అమరావతి, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంత రోడ్లకు మోక్షం కలగనుంది. ఇప్పటికే రాష్ట్ర రహదారుల పనుల నిర్మాణంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రహదారుల పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఇక గ్రామీణ రహదారుల మరమ్మతులపై దృష్టి సారించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణను పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖలు సంయుక్తంగా రూపొందించాయి. విడతల వారీగా గ్రామీణ ప్రాంత నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా తొలి విడతలో చేయాల్సిన పనులను గుర్తించారు. రాష్ట్రంలోని 4 వేల 635 కిలోమీటర్ల మేర రహదారులు దారుణమైన స్థితిలో ఉన్నట్లుగా గుర్తించిన అధికార యంత్రాంగం తొలి విడతలో ఈ పనులు పూర్తి చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అధికార యంత్రాంగం ఈ రహదారుల మరమ్మతులకు రూ.1073 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేసింది.
ఈ ప్రతిపాదనలతో ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పనులు ప్రారంభించేందుకు అవసరమైన కార్యాచరణను పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖలు రూపొందించాయి. జిల్లాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లోని రహదారుల మరమ్మతులకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలను సిద్ధం చేసి పనులను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రతి జిల్లాలో ప్యాకేజీలుగా పనులను విభజించి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. తొలి విడతలో చేయాల్సిన పనులకు సంబంధించిన టెండర్లను పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కొన్ని రహదారులను పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్యాకేజీల వారీగా పనులను విభజించి త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. దాదాపు ఒక్కో ప్యాకేజీలో రూ. 5 నుంచి రూ. 7 కోట్ల మేర పనులు సాగేలా విభజిస్తున్నారు. మరికొన్ని రహదారులకు సంబంధించి తొలి విడతలో ఆయా ప్రాం తాల్లో ఉన్న గుంతలను పూడ్చి దానిపై సింగిల్ లేయర్ రోడ్లను వేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గ్రామీణ రహదారుల పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రహదారుల నిర్మాణం, మరమ్మతులను జూన్ నాటికి పూర్తి చేసి మిగిలిన ప్రాంతాల్లో రెండో విడత పనులకు శ్రీకారం చుట్టాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది.
కాంట్రాక్టర్లకు సత్వరమే బిల్లులు..
రహదారుల నిర్మాణం నుంచి ఇతర అభివృద్ధి పనుల బిల్లులను సకాలంలో చెల్లించడం లేదన్న విమర్శలకు ప్రభుత్వం చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు ఒక్కోక్కటిగా చెల్లిస్తున్నారు. అయితే చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని అందుకే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జరిగిన పనులకు అనుగుణంగా బిల్లుల చెల్లింపులు చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు పంపించింది.
ఇదే సమయంలో త్వరలో ప్రారంభించనున్న గ్రామీణ రహదారుల పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. టెండర్ ప్రక్రియ ప్రారంభించి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుపై భరోసా కలిగించే పనిలో ఉన్నారు. పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు విడతల వారీగా చెల్లింపులు జరిగేలా నిర్దిష్టమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఒక దశ నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో కాంట్రాక్టర్లకు చెల్లి ంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయనున్నారు.