Friday, November 22, 2024

భారీగా తగ్గిన ఈవీ టూ వీలర్స్‌ అమ్మకాలు

ఏప్రిల్‌లో విద్యుత్‌ టూ వీలర్స్‌ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. వాహన్‌ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం మార్చిలో 82,292 యూనిట్లు అమ్ముడయ్యాయ. ఏప్రిల్‌లో అమ్మకాలు 62,581 యూనిట్లకు పడిపోయాయి. ఫేమ్‌ సబ్సిడీ విషయంలో కేంద్రం ప్రభుత్వం హీరో ఎలక్ట్రిక్‌, ఒకినావా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ రెండు కంపెనీలు నిబంధనలు ఉల్లంఘించడంతో సబ్సిడీకి అనర్హతగా ప్రకటించింది. విద్యుత్‌ టూ వీలర్‌ తయారీ కంపెనీలు ఒకినావా, హీరో ఎలక్టిక్‌, ఏథర్‌ ఎనర్జీ, టీవీఎస్‌ విక్రయాలు ఏప్రిల్‌లో నాలుగు నెలల కనిష్టానికి పడిపోయాయి. ఓలా ఎలక్ట్రిక్‌ మాత్రమే అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్‌లో ఓలా 21,560 యూనిట్లను విక్రయించింది. ఇది మార్చిలో విక్రయాల కంటే ఎక్కువ. మొత్తం క్యాలండర్‌ ఇయర్‌లో ఓలానే అత్యధిక అమ్మకాలు జరిపింది.

హీరో ఎలక్ట్రిక్‌, ఒకినావా రెండు కంపెనీలు ఫేమ్‌ సబ్సిడీ నిబంధనలు ఉల్లంఘించినట్లు కేంద్ర పరిశ్రమల శాఖ నోటీస్‌లు జారీ చేసింది. సబ్సిడీ పొందాలంటే 50 శాతం పరికరాలను స్థానికంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనను ఈ రెండు కంపెనీలు ఉల్లంఘించాయని పరిశ్రమల శాఖ వీటిపై చర్యలు తీసుకుంది. సబ్సిడీకి అర్హతను ఈ కంపెనీలు కోల్పోయాయి. దీంతో మార్చితో పోల్చుకుంటే ఏప్రిల్‌లో ఈ కంపెనీల అమ్మకాలు 43 శాతానికి పైగా పడిపోయాయి. మొత్తం విద్యుత్‌ వాహనాల విక్రయాల్లో ఈ రెండు సంస్థల వాటా 31 శాతం నుంచి ఏప్రిల్‌లో 10 శాతానికి పడిపోయింది.

ఓలా ఎలక్ట్రిక్‌ మార్చిలో 21,389 యూనిట్లు విక్రయిస్తే, ఏప్రిల్‌లో 21,560 యూనిట్లు విక్రయించింది. టీవీఎస్‌ మార్చిలో 16,849 యూనిట్లు, ఏప్రిల్‌లో 8,718 యూనిట్లు, ఏథర్‌ ఎనర్జీ మార్చిలో 12,167 యూనిట్లు, ఏప్రిల్‌లో 7,675 యూనిట్లు విక్రయించాయి. యాంపియర్‌ కంపెనీ మార్చిలో 9,344 యూనిట్లు, ఏప్రిల్‌లో 8,257 యూనిట్లు, హీరో ఎలక్ట్రిక్‌ మార్చిలో 6,660 యూనిట్లు, ఏప్రిల్‌లో 3,278 యూనిట్లు, బజాజ్‌ చేతక్‌ మార్చిలో 4,542 యూనిట్లు, ఏప్రిల్‌లో 3,974 యూనిట్లు, ఒకినావా మార్చిలో 4,510 యూనిట్లు, ఏప్రిల్‌లో 3,117 యూనిట్లు విక్రయించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement