Friday, November 8, 2024

28 శాతం పెరిగిన ఈవీల అమ్మకాలు

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు 28 శాతం పెరిగాయి. మొత్తం 3,57,248 ఈవీలు ఈ త్రైమాసికంలో అమ్మకాలు జరిగినట్లు జేఎంకే రిసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. వీటిలో అత్యధికంగా టూ వీలర్స్‌ ఉన్నాయి. మొత్తం అమ్మకాల్లో టూ వీలర్స్‌ 65.13 శాతం ఉన్నాయని నివేదిక తెలిపింది. ఈవీ త్రీ వీలర్స్‌లో కార్గో, ప్యాసింజర్‌ వాహనాలు 30.32 శాతం అమ్మకాలు జరిగాయి. ఈ త్రైమాసికంలో కొత్తగా 9 టూ వీలర్‌ ఈవీలు, 6 త్రీవీలర్‌ ఈవీలు, 5 ఈవీ కార్ల మోడల్స్‌ మార్కెట్లో లాంచ్‌ అయ్యాయి. 26 వేల కొత్త ఛార్జింగ్‌ పాయింట్లను నెలకొల్పారు.

ఈవీ వాహనాల అమ్మకాల్లో ఉత్తరప్రదేశ్‌ 14.33 శాతంతో అగ్రస్థానంలో ఉంది. 13.78 శాతం అమ్మకాలతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. జేఎంకే రిసెర్చ్‌ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఈవీ వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ విషయంలో చైనా అగ్రస్థానంలో ఉంది. ఈ త్రైమాసికంలో చైనా, అమెరికా, జర్మనీ, బ్రిటన్‌, ఫ్రాన్స్‌,నార్వే, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్‌, జపాన్‌ దేశాల్లో అమ్మకాలు 23 శాతం పెరిగాయి. వీటి అమ్మకాలు 20,17,714 యూనిట్ల నుంచి 24,83,021 యూనిట్లకు పెరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఈవీ ల అమ్మకాలు 56 శాతం పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement