మహబూబ్ నగర్, ప్రభన్యూస్: వానాకాలం సీజన్ వస్తున్నందున అన్నదాతలు నకిలీ విత్తనాల బారిన పడకుండా విత్తన షాపులను తనిఖీ చేసి నకిలీ విత్తన విక్రయాలను అరికట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పోలీస్ శాఖ ఉన్నత అధికారులతో కలిసి వానాకాలం సీజన్-2023 ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు, కోట్లాది మందికి ఉపాధి కల్పించడం జరుగుతున్నదని, గడిచిన 9 ఏళ్లలో రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 4.5 లక్షల కోట్లు కేటాయించడం జరిగిందని, దేశంలో మన కంటే రెండు, మూడు రెట్లు పెద్ద రాష్ట్రాల్లో సైతం ఇంత భారీగా ఖర్చు చేయలేదని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల విధానాల వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని అన్నారు. ఈ వానాకాలం సీజన్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సమయానికి అందించడంతో పాటు, పంట దిగుబడి అధికంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు అవసరమైన మేరకు విత్తనాలు, ఎరువులను స్టాక్ ఉంచుకోవాలని, ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగా ప్రస్తుత కాలంలో నకిలీ విత్తనాలు మార్కెట్‌లో దాదాపు మాయమయ్యాయని, అక్కడక్కడ ఉన్న కొంత మేర నకిలీని సైతం పూర్తిగా అరికట్టాలని, క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించి పక్క రాష్ట్రాల నుండి వచ్చే నకిలీ విత్తనాలు, ఎరువులపై దృష్టి పెట్టి పకడ్బందీగా నియంత్రించాలని అన్నారు.
దేశంలో విత్తన అవసరాలలో దాదాపు 60 శాతం మేర తెలంగాణ నుంచి సరఫరా చేస్తున్నామని, దేశానికి విత్తన బాంఢాగారంగా తెలంగాణ ఆవిర్భవించిందని తెలిపారు. తెలంగాణలో ఉన్న విత్తన ఉత్పత్తి పరిశ్రమకు ఇబ్బంది కలగకుండా, నకీలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని, నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి నిఘా పెంచాలని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్, వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.