న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం కనికరిస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, మాజీ ఎమ్మెల్సీ (బీజేపీ) మాధవ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ భవన్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కరెంట్ కోతలు చూస్తున్నామని, జగన్ పాలనలో కోతలు తప్ప ఇంకేమీ లేవని రమేశ్ నాయుడు ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణలో కరెంట్ కోతలు ఉంటాయని చెప్పారని, కానీ ఎన్నో వనరులు, విద్యుత్ ప్రాజెక్టులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోతలు విధించాల్సిన పరిస్థితి వచ్చిందంటే పాలకుల ముందుచూపు ఎలా ఉందో అర్థమవుతుందని అన్నారు.
జగన్ చేతకానితనం కారణంగా పల్లెసీమలు చీకట్లో మగ్గిపోతున్నాయని, విద్యార్థులు దీపాలు పెట్టుకుని చదువుకునే దుస్థితి ఏర్పడిందని అన్నారు. చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే వీధి దీపాల కింద చదువుకున్నామని చెప్పుకునే పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు. డిమాండ్‌కు తగిన విద్యుత్ ఉత్పత్తి, సరఫరా లేకపోవడం వల్ల క్రాప్ హాలీడేలు, పరిశ్రమలకు 12 గంటల పాటు మాత్రమే విద్యుత్ ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని సూత్రీకరించారు. ఉదయం గం. 6.00 నుంచి సాయంత్రం గం. 6.00 వరకు మాత్రమే పరిశ్రమలు పనిచేయాలని, ఆపై పనిచేస్తే జరిమానా విధిస్తున్నారని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, మైమరిపించడం.. మాయ చేయడం తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. ఇసుక, ఎర్రచందనం, మద్యం జగన్ కి ఆదాయ వనరులుగా మారిపోయాయని దుయ్యబట్టారు. అమర్ రాజా బ్యాటరీస్ వంటి సంస్థను వెళ్లిపోవాలంటూ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతలు చెప్పిన ఉదంతాలు చూశామని, జగన్ అరాచక పాలనకు మరో 6 నెలలు మాత్రమే గడువు ఉందని ప్రజలు అనుకుంటున్నారని రమేశ్ నాయుడు వెల్లడించారు. ప్రభుత్వంలో, పార్టీలో జగన్ పట్టు కోల్పోయారని, ఇప్పటికే ఓటమి అంచుల్లోకి వెళ్లిపోయారని అన్నారు.