ఆర్టీసీ ఎండీగా బాద్యతలు చేపట్టిన నాటి నుంచి సజ్జనార్ తనదైనశైలిలో దూసుకుపోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా ట్విట్టర్ వేదికగా.. స్పందిస్తూ సజ్జనార్ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా నాగర్‌కర్నూల్ డిపోకు చెందిన డ్రైవర్ శాంతయ్య.. పాట పాడిన వీడియోను వీసీ సజ్జనార్ షేర్ చేశారు. శాంతయ్య పాట పాడి ప్రయాణికులను ఆకట్టుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని నాయినిపల్లి మైసమ్మ ఆలయంలో ప్రతి ఆదివారం జాతర జరుగుతుంది. మైసమ్మను దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీంతో నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి డిపోల నుంచి ఈ ఆలయానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపిస్తారు.
దీనిలో భాగంగా ఆదివారం.. నాగర్‌కర్నూల్ డిపోకు చెందిన డ్రైవర్ శాంతయ్య.. మైసమ్మ జాతరకు వచ్చే ప్రయాణికులను ఆకర్షించేందుకు పాట పాడి మైమరిపించారు. మైసమ్మ దేవత ప్రాశస్త్యాన్ని వివరిస్తూ.. శాంతయ్య పాటను ఆలపించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం.. సురక్షితమంటూ ప్రయాణికులకు వివరించారు. అయితే.. డ్రైవర్ పాడిన పాట వీడియోను.. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది.