ముంబై – బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. తన నివాసంలోనే ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలైనట్లు తెలుస్తోంది. సైఫ్‌ను లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు
గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అతడిని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు
సైఫ్‌ను దొంగ కత్తితో దాడి చేశాడా.. ? లేదా అతడితో ఏమైనా గొడవ జరిగిన సమయంలో సైఫ్ గాయపడ్డాడా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మేము ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నాము. ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది” అని సీనియర్ ఐపీఎస్ అధికారి తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై సైఫ్ పర్సనల్ టీమ్ స్పందిస్తూ.. ప్రస్తుతం సైఫ్ కు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుందని.. ఈ ఘటనపై మీడియా, అభిమానులు ఓపిక పట్టాలని కోరుతున్నామని.. ఇది పోలీసుల విషయం, మేము పరిస్థితిని మీకు తెలియజేస్తాము అని పేర్కోన్నారు.
అర్ధరాత్రి 3.30 గంటల సమయంలో సైఫ్ అలీఖాన్‌ని లీలావతి ఆసుపత్రికి తీసుకొచ్చారు . అతని శరీరంపై మొత్తం ఆరు గాయాలు ఉండగా వాటిలో రెండు లోతుగా ఉన్నాయి. అతని వెన్నెముక దగ్గర బలంగా గాయమైంది. ప్రస్తుతం ఆయనకు న్యూరోసర్జన్ నితిన్ డాంగే, కాస్మెటిక్ సర్జన్ లీనా జైన్, అనస్థటిస్ట్ నిషా గాంధీ చికిత్స అందిస్తున్నారు. సైఫ్‌కు సర్జరీ చేసిన తర్వాతే మరింత సమాచారం అందించగలుగుతాం “అని లీలావతి హాస్పిటల్ సీఈవో నీరజ్ వివరించారు