మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డుప్రమాదంపై మాదాపూర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ విడుదల చేశారు. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి సమీపంలోని ఐకియా స్టోర్ వద్ద స్పోర్ట్స్ బైక్ నుంచి సాయిధరమ్‌తేజ్ కిందపడిపోయాడు. ఘటనా స్థలంలో మట్టి, ఇసుక ఉండటంతో అతడి బైక్ స్కిడ్ అయిందని పోలీసులు తెలిపారు. అయితే సాయితేజ్ మద్యం సేవించలేదని, హెల్మెట్ ధరించాడని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అది 1160 సీసీతో నడిచే బైక్ అని పేర్కొన్నారు. కాగా నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ కింద సాయిధరమ్‌పై రాయదుర్గం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.
కాగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయికి సీటీ స్కాన్‌తో పాటు పలు రకాల టెస్టులు చేశామన్నారు. కాలర్ బోన్ ఫ్యాక్చర్ అయిందని, ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఇన్‌సైడ్ బ్లీడింగ్, ఆర్గాన్ డ్యామేజ్ కాలేదన్నారు. 24 గం. పాటు ఐసీయూలోనే ఉంచనునట్లు చెప్పారు.
మరోవైపు కేబుల్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించాడు. సాయి ఆరోగ్యం నిలకడగా ఉందని ట్విట్టర్‌లో తెలిపాడు. ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ ఎలాంటి మద్యం తాగలేదు. రోడ్డుపై ఇసుక (మట్టి) ఉండడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు’ అని చిరంజీవి ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.