Saturday, November 23, 2024

Ballari | సాయి కొర్రపాటి ‘అమృతేశ్వరుని’కి ప్రాణప్రతిష్ఠ నేడే !

  • అఖండ శివ కార్యంలో రాజమౌళి, పురాణపండ, యశ్, మంగ్లీ


బళ్లారి, ఫిబ్రవరి 28 (ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి): కాశీక్షేత్రంలోని అన్నపూర్ణమ్మ తల్లి లోకోత్తర లావణ్యమంతా కలియుగంలో అన్న ప్రసాదాన్ని పూజ్య భావనతో చూసేవారిపై ప్రసరిస్తుందంటాడు శ్రీనాధుడు. అలాంటి వారణాసి విశ్వేశ్వరుని పట్టపురాణి అన్నపూర్ణమ్మతల్లి ప్రసన్నమైన విగ్రహం ఒక వైపు కొలువుదీరగా, మరొక వైపు లలితా పరాభట్టారికా దేవి తేజస్సులోంచి అవతరించిన వారాహి అమ్మవారి తేజోవంతమైన విగ్రహం, శివ పార్వతుల ముద్దుల తనయుడు విఘ్నరాజు వినాయకుడు, మహా వెలుగుల నృసింహ భగవానుడు, కాశీ క్షేత్రపాలకుడైన కాలభైరవుని అత్యద్భుత విగ్రహాలతో కర్ణాటక రాష్ట్రం బళ్లారి బాలాజీనగర్ లో ఒక సంచలనాత్మక పవిత్రాలయం భారతదేశ భక్తకోటికి నేడు అంకితంకాబోతోంది.

ప్రఖ్యాత చలన చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేతలు సాయి కొర్రపాటి, రజని కొర్రపాటి సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో పరమ శోభాయమానంగా నిర్మించిన ఈ ఆలయం పేరు ‘ శ్రీ అమృతేశ్వర ఆలయం’ గా వేదపండితులు నిర్ణయించడం విశేషం. ఆస్కార్ విజేతలు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి, ఎం.ఎం.కీరవాణికి అత్యంత సన్నిహితుడుగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సినీ రంగ ప్రముఖులకు సుమారు దశాబ్దంన్నరగా చిరపరిచితులైన సాయి కొర్రపాటి వారాహి బ్యానర్ పై ‘ఈగ’ సినీ నిర్మాతగా ఆనాటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా ఉత్తమ చలన చిత్ర నిర్మాత పురస్కారాన్ని అందుకున్నారు కూడా.

శ్రీ అమృతేశ్వర దేవాలయంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో గురువారం ఉదయం రెండుకోట్ల రూపాయల విలువైన హిమాలయ స్వచ్ఛ స్పటికలింగం శివోపాసకులైన శ్రీ శారదా లక్ష్మీ నరసింహ పీఠం అధిపతులు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామీజీ వారి పవిత్ర హస్తాలతో వేద మంత్రాలమధ్య ప్రాణప్రతిష్ఠ చేసుకోబోతోంది. ఇప్పటికే గత నాలుగు రోజులుగా సచ్చిదానంద భారతీ మహారాజ్ శిష్య బృందంచే హోమాలు, జపతాపాలు, పూజలు, అర్చనలు విధి విధానంగా నడుస్తున్నాయి. ప్రధానాంశం విశ్లేషిస్తే ఈ అమృతేశ్వరాలయం మొత్తం అత్యంత అరుదైన కృష్ణ శిలలతో మాత్రమే నిర్మించబడి కర్ణాటక రాష్ట్రంలో మొట్టమొదటి ఆలయంగా చరిత్రకెక్కడం ఒక విశేషమైతే, సాయి కొర్రపాటికి ఈ ఆలయం నిర్మించాలనే గొప్ప సంకల్పం వెనుక తరతరాలుగా వేద వేదాంగ పురాణేతిహాసాల, ఉపనిషత్తులలో విశేష నిష్ణాతులైన పురాణపండ వారి వంశంలో ఈతరం ప్రతినిధి, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ప్రత్యక్ష, పరోక్షంగా కారణమని సాయి కొర్రపాటి బంధుమిత్రులు, హైదరాబాద్ ఫిలిం నగర్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

- Advertisement -

పురాణపండ శ్రీనివాస్ అనగానే పరమాద్భుత పవిత్ర గ్రంధాలు తెలుగు వారికి గుర్తుకొస్తాయి. శ్రీనివాస్ స్వార్ధం లేని జీవితం ఆశ్చర్యపరుస్తుంది కూడా. గతంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నతాధికారిగా ఉద్యోగించిన శ్రీనివాస్ ద్వాదశ జ్యోతర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైల దేవస్థానంకి ప్రత్యేక సలహాదారునిగా నాటి రాష్ట్ర ప్రభుత్వంచే నియమింపబడి కొన్నేళ్లపాటు సమర్ధ సేవలు అందించారు. సాయి కొర్రపాటి సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ తన విలక్షణ రచనా సంకలన వైవిధ్యంతో అతి అరుదైన ఐదువందల ఆంజనేయ చిత్రాలతో రూపొందించిన వీర హనుమాన్ ఉపాసనా అఖండ గ్రంధం ‘నన్నేలు నా స్వామి’ గ్రంధాన్ని భారతదేశ హోంశాఖామంత్రి న్యూఢిల్లీలో అమిత్ షా గత సంవత్సరం ఆవిష్కరించి అభినందించడం పండిత వర్గాలకెరుకే.

ఇలా రాజమౌళి, కీరవాణిలతో పాటు పురాణపండ శ్రీనివాస్ తో వున్న గాఢమైన మైత్రీ బంధమే ఈ ఆలయ నిర్మాణానికి శివాజ్ఞగా బీజం వేసిందని తెలుగు చలన చిత్ర ప్రముఖులు, విశ్లేషకులు బాహాటంగా చెబుతున్నారు. అంతేకాదు వారాహి చలన చిత్రం నిర్మించిన కొన్ని చిత్రాల్లో రాజమౌళి, కీరవాణి , పురాణపండ శ్రీనివాస్ లకు ప్రత్యేక కృతజ్ఞత కార్డు కనిపిస్తుంది. అయితే .. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నగరానికి పది కిలోమీటర్ల దూరంలో తాళ్లూరు రోడ్ బాలాజీ నగర్ హైవే కి ఆనుకుని వున్న విశాలమైన స్థలంలో ఈ అమృతేశ్వరుడు రేపు కొలువుదీరడం తమ ప్రాంతపు అదృష్టంగా భావిస్తున్నారు బళ్లారి వాసులు. పూర్తి శైవాగమ వాస్తుతో, నాణ్యతా ప్రమాణాల్లో, పవిత్రతలో ఎక్కడా రాజీపడకుండా సాయి కొర్రపాటి సుమారు రెండు సంవత్సరాల కాల వ్యవధిలో నిర్మించిన ఈ ఆలయం స్వయంభు క్షేత్రంలా భవిష్యత్తులో తర తరాలకూ వెలుగై నిలుస్తుందని ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సైతం చర్చించుకోవడం గమనార్హం.

విశాలమైన ఈ ఆలయం మధ్య భాగంలో బసవడు, ముందు భాగంలో ఆంజనేయుడు, ప్రక్కన పుష్కరిణిలో శ్రీ కృష్ణుడు భక్తకోటిని ఆకట్టుకొనేలా తీర్చిదిద్దారు. అనేక నందులు ఆ ఆలయంలో చాలా అందంగా దర్శనమిస్తాయి. తన తండ్రి కొర్రపాటి వెంకట నారాయణ స్మారకంగా ఈ ఆలయాన్ని వైభవంగా రూపుదిద్దే క్రమంలో ఎదుర్కొన్న ఆటుపోట్లకు తనకి ధైర్యమిచ్చిన రాజమౌళి, కీరవాణి, కిమ్స్ హాస్పిటల్స్ భాస్కర్ రావు కుటుంబాలకు తానెంతో రుణపడి ఉన్నట్లు సాయి కొర్రపాటి చెప్పారు. ఎప్పుడూ చలన చిత్రాలే తన ప్రపంచమని, కానీ ఈ పరమ పవిత్ర మహా సంకల్పం వెనుక బలమైన శక్తి సాహితీమిత్రుడు, నిస్వార్థమైన స్నేహితుడు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మాత్రమేనని అనేక సందర్భాల్లో చెప్పినట్లు ఫిలింనగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.

శివుని ఆజ్ఞతో తాను ఈ ఆలయంకి భూమిపూజ చేసినప్పటి నుంచీ, నిర్మాణం ప్రారంభించినప్పటినుంచీ తానెన్నో శారీరక, మానసిక ఆర్ధిక ఆటుపోట్లేదుర్కొన్నానని, విఘ్నేశ్వరుని కటాక్షంతో అవాంతరాలు తొలగి ఇలా మీకు ఇంతటి ఆలయ సౌందర్యం ముందుకొచ్చిందని సాయి కొర్రపాటి చెప్పినట్లు ఆలయవర్గాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 29వ తేదీ ఉదయవేళ నుండీ ఎన్నో యాజ్ఞికమైన మంత్రకార్యాలు శాస్త్రోక్తంగా జరిపించి శ్రీ శారదా లక్ష్మీ నరసింహ పీఠం అధిపతులు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఈ అత్యద్భుత స్పటిక లింగం ప్రతిష్టించబడుతోందని ఆలయ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ప్రతిష్టా మహాకార్యంలో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కుటుంబం, ఉద్దండ సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబం, కేజీఎఫ్ చిత్రం హీరో రాకింగ్ స్టార్ యశ్ కుటుంబం, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కుటుంబం, జానపద గీతాల ఫేమ్, ప్రఖ్యాత గాయని మంగ్లీతో పాటు కర్ణాటక తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విఖ్యాత నిర్మాతగా పేరుపొందిన నాటి తరం మనసున్న మనిషి , కధానాయకుడు జగపతిబాబు తండ్రి వీ.బి.రాజేంద్రప్రసాద్ కీలక సూత్రధారిగా వ్యవహరించిన ఫిలింనగర్ దైవ సన్నిధానం ఆలయ సముదాయాన్ని హైదరాబాద్ లో నిర్మించి ఆకట్టుకొంటే, ప్రముఖ చలన చిత్ర నిర్మాత దిల్ రాజు తన స్వగ్రామమైన నిజామాబాద్ లో తన ఇష్టదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించిన విషయం సినీ పరిశ్రమకు, భక్తకోటికి ఎరుకే. అయితే… సాయి కొర్రపాటి నిర్మించిన ఆలయం మాత్రం చాలా భారీ స్థాయిలో నిర్మించబడిందని, రాబోయేకాలంలో దేశంలోని ప్రఖ్యాత శైవ క్షేత్రాల తొలివరసలో ఈ అమృతేశ్వర ఆలయం కూడా చేరడం ఖాయమని, వ్యాపార విలువలకు దూరంగా కొమ్ములు తిరిగిన పండితులంటున్నారు. ఏదేమైనా గత రెండు సంవత్సరాలుగా తన చలన చిత్ర నిర్మాణాలను కూడా ప్రక్కకు పెట్టి, శివ పరివారానికి దాసోహమై … తన బంధు మిత్రుల , కొందరు దాతల సహకారంతో పాటు తన శక్తికి మించిన సొంత ఖర్చుతో ఇంతటి మహా శైవ ఆలయ సముదాయాన్ని ఈ జాతికి సమర్పిస్తున్న పరమ శివభక్తులు సాయి కొర్రపాటి, రజనిలకు ప్రక్కన సమర్ధవంతమైన ప్రోత్సాహమిస్తున్న రాజమౌళి, కీరవాణి, పురాణపండ శ్రీనివాస్ లను కులమతాలకతీతంగా శివభక్తులు అభినందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement