Friday, September 20, 2024

TG: సాగ‌ర్ కాలువ‌కు గండి.. నెట్టెంపాడులో మోటార్లు మొరాయింపు..

కాలువ‌ల‌లో నీటి విడుద‌ల‌కు బ్రేక్
గండి పూడ్చేందుకు య‌ద్ధ‌ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు
మోటార్ల రిపేర్ కు బీహెచ్ ఈఎల్ పిలుపు
ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ : రిజ‌ర్వాయ‌ర్ల నుంచి నీటి విడుద‌ల చేసే క్ర‌మంలో ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి.. సాగ‌ర్ ఎడ‌మ కాలువకు గండి ప‌డ‌డంతో నీటి విడుద‌ల‌ను నిలిపివేశారు.. ఇక నెట్టెంపాడు ఎత్తిపోత‌ల మోటార్లు మొరాయించ‌డంతో నీటి పంపింగ్ నిలిపివేశారు..

సాగ‌ర్ కాలువ‌కు గండి…
శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ కు భారీగా వరద వస్తుండటంతో అధికారులు సాగర్ గేట్లతో పాటు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే సాగర్ ఎడమ కాలువలో నీరు భారీగా ప్రవహిస్తుండటంతో వరద కాలువకు గండి పడింది. అనుములు మండలం మారెపల్లి వద్ద భారీ గండి పడడంతో కాలువలోని నీరు పొలాల్లోకి భారీ ఎత్తున చేరుకున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఎడమ కాలువలో నీటి విడుద‌ల‌ను ఆపివేసినట్లు తెలిపారు. అలాగే గండి పడిన ప్రదేశానికి చేరుకుని పూడిక పనులు యుద్ద ప్రాతిప‌దిక‌న ప్రారంభించారు.

నెట్టెంపాడులో మోటార్లు మొరాయింపు..
సాగునీటి ఎత్తిపోతల పథకం నెట్టెంపాడు ప్రాజెక్ట్ కింద ఉన్న జూరాల నుంచి నీటిని ఎత్తిపోసే ఫేజ్-1 పంపులు సాంకేతిక సమస్యతో రాత్రి నుంచి ఆగిపోయాయి. పంపులకు అందించే ముఖ్యమైన సర్క్యూట్‌లో స్టాటికల్ ఫ్రీక్వెన్సీ కంపోనెంట్ (ఎస్‌ఎఫ్‌సీ) సమస్య కారణంగా నీటిని ఎత్తిపోసే పంపులు ఆగిపోయాయని అధికారులు చెప్పారు. అయితే, సాంకేతిక సమస్యను నెట్టెంపాడు ప్రాజెక్ట్ కింద ఉన్న పంపులను బీహెచ్‌ఈఎల్ కంపెనీ మాత్రమే సరిదిద్దేందుకు అవకాశం ఉంది. కాగా, ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కింద రూ.1.13 కోట్లు బాకీ పడింది. దీనిపై ఇరిగేషన్ అధికారులు బీహెచ్‌ఈఎల్ కంపెనీతో మాట్లాడారు. త్వ‌ర‌లోనే బ‌కాయిలు చెల్లిస్తామ‌ని హామీ ఇవ్వ‌డంతో మోటార్లు రిపేర్ చేసేందుకు త్వ‌ర‌లో వ‌స్తామ‌ని బీహెచ్‌ఈఎల్ అధికారులు చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement