కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. కొండలన్నీ భక్తులతో నిండిపోయాయి. అయ్యప్ప దర్శనానికి సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. అసలు ఒక సీజన్ లో ఒక్క రోజులో అధిక సంఖ్యలో భక్తులు దర్శనాలకు రావడం ఇదే మొదటిసారి అని ఆలయం వర్గాలు చెబుతున్నాయి. రద్దీ నియంత్రణకు అదనపు పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్నదానం, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరోవైపు రద్దీ రోజుల్లో అధిక సమయం పాటు స్వామి దర్శనాన్ని భక్తులకు కల్పించడాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించింది. అయ్యప్పస్వామి సన్నిధి తంత్రిని సంప్రదించి దర్శన సమయాన్ని 30 నిమిషాలు పెంచాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ (టీడీబీ)ని హైకోర్టు కోరింది. రద్దీ నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, పోలీసులను ఆదేశించింది. రోజువారీ భక్తుల సగటు సంఖ్య 75 వేలకు పైగానే ఉంటోంది. సోమవారం ఒక్క రోజే స్వామి దర్శనం కోసం రూ.1,07,260 మంది భక్తులు తమ పేర్లను బుక్ చేసుకున్నారు. గత శనివారం కోసం లక్ష మంది బుక్ చేసుకోగా, 90వేల మంది భక్తులు వచ్చారు. భారీ సంఖ్యలో వస్తున్న వాహనాల క్రమబద్ధీకరణకు సైతం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భక్తుల రద్దీ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం శబరిమలలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement