అయ్యప్ప దర్శనం కోసం భారీగా తరలివస్తున్న భక్తులతో శబరిగిరులు కిటకిటలాడాయి. వార్షిక మండలం-మకరవిళక్కు పూజ కోసం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని గత నెల 15న తెరిచారు. కాగా, స్వామివారి దర్శనాలు ప్రారంభమై నెలరోజులు పూర్తికావడంతో… ఈ 29 రోజుల్లో (ఈ నెల 14 వరకు) వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు.
శబరిమల అయ్యప్ప ఆదాయం గతేడాది రికార్డులను మించిపోయిందని వెల్లడించారు. 22 లక్షల మందికి పైగా భక్తులు శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారని.. ఈ 29 రోజుల్లో శబరిమల ఆలయానికి వచ్చిన మొత్తం ఆదాయం రూ.163.89 కోట్లు అని ట్రావెన్ కోర్ దేవస్వామ్ బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది రూ.22.76 కోట్లు అధికమని స్పష్టం చేశారు.
అయ్యప్ప ప్రసాదం అరవణ ప్రసాదం విక్రయం ద్వారా రూ.82.67 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. కానుకల రూపంలో మరో రూ.52.27 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. ఇక అయ్యప్ప భక్తులకు సజావుగా దర్శనం కల్పించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ సందర్భంగా ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డుకు సహకరించిన కేరళ పోలీసులకు, అన్ని శాఖల అధికారులకు బోర్డు అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు.