ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జి-20 విదేశాంగ మంత్రుల సమావేశంనుంచి రష్యా వాకౌట్ చేసింది. ఉక్రెయిన్‌పై దండయాత్ర చేయడాన్ని తప్పుబడుతూ సభ్య దేశాలు, అతిథులు పదేపదే ప్రశ్నించడంతో రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లవరోవ్ సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. ప్రస్తుతం బాలిలో జి-20 విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారంనాడు సమావేశం ప్రారంభం కాగానే రష్యా జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బాయెర్‌బొక్ జోక్యం చేసుకుంటూ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను తప్పుబట్టారు. నేరుగా రష్యా విదేశాంగ మంత్రి లవరోవ్‌ను నిలదీశారు. అదే సమయంలో అమెరికా, పశ్చిమ దేశాల విదేశాంగ మంత్రులు కూడా రష్యా తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే విమర్శల జోరు పెరగడంతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ జోక్యం చేసుకుని అడ్డుకట్ట వేశారు. ఉక్రెయిన్‌పై దండయాత్రకు తెరవేయాలన్న అభిప్రాయం ప్రపంచదేశాలనుంచి వెల్లడైందని బ్లింకెన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతకుముందు లవరోవ్‌తో బ్లింకెన్‌ల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి.
ఉక్రెయిన్, రష్యా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా బ్లింకెన్ సూచించారు. ప్రపంచ ఆహారభద్రతకు రష్యా కారణమవుతోందని, ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల రవాణాకు అడ్డు తొలగించాలని లవరోవ్‌కు సూచించారు. ఉక్రెయిన్ మీ దేశం కాదు. అక్కడ పండిన పంటలు మీవి కావు.. అయినా అక్కడి పోర్టులనుంచి రవాణాను ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. అయితే ఆ చర్చలనుంచి కూడా లవరోవ్ మధ్యలోనే వెళ్లిపోయారు. మధ్యాహ్నం జీ-20 విదేశాంగ మంత్రులు భేటీ అయినప్పుడు కూడా అలాగే వ్యవహరించారు. ఈ సమావేశానికి ఉక్రెయిన్ విదేశాంగమంత్రి దిమిత్రి కులేబా వర్చువల్‌గా హాజరై మాట్లాడారు. సమావేశంలో ఆర్థిక అంశాలను చర్చించకుండా మొదటినుంచి రష్యాపై విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారంటూ లవరోవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.