Monday, November 18, 2024

ఉక్రెయిన్‌ చేతికి రష్యా వార్ఫేర్‌ సిస్టమ్‌.. రాడార్లు, డ్రోన్లు నిర్వీర్యం చేసే సత్తా

రష్యాకు ఉక్రెయిన్‌ గట్టి షాక్‌ ఇచ్చింది. ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన రష్యా వార్ఫేర్‌ వ్యవస్థ ఉక్రెయిన్‌ చేతికి దక్కింది. కీవ్‌ శివారుల్లో పడి ఉన్న రష్యాకు చెందిన క్రాసుఖా-4 ఈడబ్ల్యూ వ్యవస్థ ఇది. ఈ సిస్టమ్‌ ఎంతో కీలకమైంది. దీన్ని ఉపయోగించి అవాక్స్‌ విమానాలు, నిఘా ఉపగ్రహాలు పని చేయకుండా చేయవచ్చు. ఇంతటి ముఖ్యమైన వ్యవస్థను కీవ్‌లో రష్యా ఎందుకు వదిలేసినట్టో ఎవరికీ అర్థం కావడం లేదు. దీన్ని ఉక్రెయిన్‌ సైనికులు.. వాహనంలో తరలించి తీసుకెళ్లిపోయారు. శత్రువు ప్రయోగించే రాకెట్లు వంటి వాటికి లక్ష్యాలు అందనీయకుండా ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. రష్యా నుంచి ఉక్రెయిన్‌ చేతికి చిక్కిన కీలక ఆయుధంగా చెప్పుకోవచ్చు. పెద్ద పరిమాణంలో ఉండే ఈ వ్యవస్థ ఉపయోగించాలంటే.. రెండు వాహనాలు అవసరం అవుతాయి. ఒకదాంట్లో ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థ ఉంటే.. మరోదాంట్లో దీనికి సంబంధించిన కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఉంటుంది.

క్రాసుఖా-4 ఎంతో కీలకం..

క్రాసుఖా-4 అనేది ఓ మొబైల్‌ జామింగ్‌ సిస్టమ్‌. 150-300 కిలోమీటర్ల దూరంలోని సిగ్నల్స్‌ను జామ్‌ చేసే సామర్థ్యం దీనికి ఉంటుంది. నిఘా, ఇంటెలిజెన్స్‌ సేకరించే ఉప గ్రహాల నుంచి రష్యా ఆయుధ వ్యవస్థలను రక్షించడానికి చేపట్టిన ఓ ప్రాజెక్టులో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థలను బెలారస్‌, ఉక్రెయిన్‌ భూభాగాలపై రష్యా మోహరించింది. రష్యాలోని బ్రయాన్స్‌, ఎలక్ట్రో మెకానికల్‌ ప్లాంట్‌లో దీన్ని తయారు చేశారు. భూ దిగువ కక్ష్యలో తిరిగే ఉప గ్రహాలను, భూ ఉపరితలంపై అమర్చిన రాడార్లు, ఏరియల్‌ రాడార్లను పని చేయకుండా చేస్తుంది. ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌తో పాటు కమ్యూనికేషన్‌ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయగలదు. దీని ద్వారా నాటో గగనతలం, అంతర్జాతీయ గగనతలంలో ప్రయాణించే నిఘా విమానాలు, డ్రోన్లను జామ్‌ చేయడానికి వినియోగిస్తున్నారు. లక్కీగా ఇది ఉక్రెయిన్‌ ఆర్మీకి దొరికింది. కొన్నాళ్ల క్రితం ఇటువంటి రి&ుటెల్‌ అనే కమ్యూనికేషన్‌ జామింగ్‌ వ్యవస్థను కూడా ఉక్రెయిన్‌ ధ్వంసం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement