రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచనల వ్యాఖ్యలు చేశారు. రష్యాపై ఆంక్షలు విధించడం అంటే యుద్ధంతో సమానమని హెచ్చరించారు. ఇందుకు నాటో దేశాలు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని చెప్పుకొచ్చారు. శనివారం మహిళా పైలట్లతో పుతిన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఊహించినదానికంటే ఉక్రెయిన్‌పై భీకరంగా యుద్ధం చేస్తామని తెలిపారు. ఎంతో ఆలోచించి ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించామని, తమ డిమాండ్లు నెరవేరేవరకు యుద్ధం ఆగదని పుతిన్ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలు లేకుండా చేస్తామన్నారు. శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించిందని విమర్శించారు. రష్యాలో మార్షల్ లా విధించే అవసరం లేదని పుతిన్ పేర్కొన్నారు.
యుద్ధం యుద్ధమే అని.. చర్చలు చర్చలే అని ఉక్రెయిన్‌కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రెండు సార్లు ఉక్రెయిన్‌తో చర్చలు జరిపితే.. మొండిగా వ్యవహరించిందని విమర్శించారు. తమ డిమాండ్లపై ఉక్రెయిన్ గట్టిగా పట్టుబడుతోందన్నారు. మూడోసారి చర్చలు జరగనున్నాయని, నాటోలో చేరబోమని లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పుకొచ్చారు. తూర్పు వైపు డాన్సాస్ ప్రాంతంపై తమ ఆధిక్యతను ఒప్పుకోవాలని, క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఉక్రెయిన్‌లోని తమ ఆర్మీని ఉప సంహరించుకుంటామని తేల్చి చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..