Friday, November 22, 2024

ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి, కీవ్‌కు సమీపంలో రష్యన్‌ ఆర్మీ.. ఆస్పత్రిపై రష్యా క్షిపణితో ఎటాక్‌..

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను రష్యా సైన్యం సమీపిస్తున్నది. ఏ క్షణమైనా.. కీవ్‌ను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కీవ్‌ నగరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే రష్యన్‌ ఆర్మీ ఉంది. కీవ్‌ వైపు రష్యా బలగాలు దూసుకొస్తున్నాయి. నలువైపుల నుంచి కీవ్‌ను చుట్టుముట్టేశాయి. కీవ్‌పై మూకుమ్మడి దాడి చేసి హస్తగతం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ.. ఉక్రెయిన్‌-రష్యా మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. 16వ రోజు కూడా ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై రష్యా బాంబు దాడులకు దిగింది. సామాన్య పౌరులే లక్ష్యంగా రష్యన్‌ బలగాలు విరుచుకుపడుతున్నాయి. 16 రోజులు గడుస్తున్నా.. కీవ్‌ను రష్యా హస్తగతం చేసుకోలేకపోయింది. ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. విదేశాంగ మంత్రులు టర్కీలో సమావేశం అయ్యారు. ఆ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. యుద్ధం విరమించడానికి రష్యా సిద్ధంగా లేదని, తాము లొంగిపోవాలన్నదే పుతిన్‌ ఉద్దేశం అన్నారు ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో. కానీ తాము తగ్గే ప్రసక్తే లేదంటున్నది ఉక్రెయిన్‌. గతంలో ప్రతిపాదించిన డిమాండ్‌లనే మళ్లి ఉక్రెయిన్‌ ముందు రష్యా ఉంచింది. ఎప్పటిలాగే.. అదేవిధమైన ప్రకటన ఉక్రెయిన్‌ చేయడంతో.. చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి.
1300 మంది పౌరులు మృతి

మరియుపోల్‌లోని ఆస్పత్రులపై రష్యా దాడులు చేసింది. మరియుపోల్‌లో ప్రజలు తిండి, నీరు లేక అలమటించిపోతున్నారు. రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 1300 మంది పౌరులు చనిపోయినట్టు ఉక్రెయిన్‌ ప్రకటించింది. రూ.7.6లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు జెలెన్‌ స్కీ ఆర్థిక సలహాదారు ఒలేగ్‌ ఉస్టెంకో వెల్లడించారు. మాస్కో సేనలు జరిపిన దాడుల్లో భారీ భవనాలు, మౌలిక సదుపాయాలు, ఇతర ఆస్తులు ధంసమైనట్టు తెలిపారు. పీటర్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫరర్‌ ఇంటర్నేషనల్‌ ఎకనమిక్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఒలేగ్‌ మాట్లాడారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో 50శాతానికి పైగా వాణిజ్య కార్యక్రమాలు మూసివేతకు గురయ్యాయి. మిగిలిన వాణిజ్య కార్యకలాపాలు మందకోడిగానే సాగుతున్నాయి. రహదారులు, వంతెనలు, ఆస్పత్రులు, అనేక పరికరాలు ధ్వంసం అయ్యాయి. నష్ట పరిహారాన్ని రష్యా నుంచే వసూలు చేస్తామన్నారు. దేశం వెలుపల ఉన్న రష్యన్‌ సెంట్రల్‌ బ్యాంకు ఆస్తులతో పాటు ఒలిగార్క్‌ల నుంచి సాధీనం చేసుకున్న ఆస్తులను కూడా పునర్‌ నిర్మాణ నిధికి బదిలీ చేయవచ్చన్నారు. రష్యా దాడికి ముందు ఉక్రెయిన్‌లో ఆర్థిక నిల్వలు 30 బి.డాలర్లు ఉండగా.. ప్రస్తుతం 27.56 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement