Monday, November 25, 2024

ర‌ష్యన్ అబ్బాయి, ఉక్రెయిన్ అమ్మాయి.. ఇండియా క‌లిపింది ఇద్ద‌రినీ!

ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఉక్రెయిన్‌పై రష్యా పెద్ద ఎత్తున దండయాత్రకు దిగింది. అటు గ‌గ‌నత‌లంతోపాటు.. ఇటు నేల‌మీద, నీటిలోనూ త్రివిధ ద‌ళాల‌ను దింపి వార్ చేస్తోంది. ఇంకా ఈ యుద్ధం స‌మ‌సిపోలేదు. దీని ఫ‌లితంగా ల‌క్ష‌లాది మంది ఉక్రేనియన్లు దేశం విడిచి పారిపోయారు. అయితే.. ఇంత‌టి భీకర యుద్ధంలోనూ ఓ ప్రేమ జంట వారి ప్రేమ‌ను ఎలా గెలిపించుకుందో ఈ స్టోరీ చ‌దివితే అర్థ‌మ‌వుతుంది. ర‌ష్యా అబ్బాయి, ఉక్రెయిన్ అమ్మాయి వార్ స‌మ‌యంలోనే దేశాల‌ను దాటేసి ఇండియా వ‌చ్చి ఒక్క‌ట‌య్యారు.

ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం సాగుతున్న సమయంలో ప్రేమకు హద్దులు చెరిపేస్తూ తమ రెండు దేశాలు కాకుండా మరో ప్రదేశమైన ఇండియాలోని ధర్మశాలలో వారిద్దరూ ఒక్కట‌య్యారు. రష్యా జాతీయుడైన సెర్గీ నోవికోవ్ తన ఉక్రేనియన్ స్నేహితురాలు ఎలోనా బ్రమోకాను ప్రేమించాడు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య వార్ జ‌రుగుతుండ‌డంతో వారు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో హిందూ సంప్రదాయ పద్ధతిలో మొన్న (ఆగస్టు 2వ తేదీన) పెళ్లి చేసుకొని.. ప్రేమకు హద్దులు లేవని నిరూపించారు.

తమ రెండు దేశాల మధ్య జరుగుతున్న భీకరమైన యుద్ధం గురించి పట్టించుకోకుండా, తటస్థ మైదానంలో ఒకరినొకరు వివాహం చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. హిందూ సంప్రదాయబద్ధంగా వధువు ఎలోనా ఎరుపు, బంగారు రంగు లెహంగాను ధరించగా.. సెర్గీ మెరూన్ కుర్తా-పైజామా, నెహ్రూ జాకెట్‌ను ధరించి పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు. హిందూ పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తుండగా వధూవరులు సెర్గీ నోవికోవ్, ఎలోనా బ్రమోకాలు ఏడు అడుగులు వేశారు.

స్థానికులు కూడా ఈ వివాహానికి హాజరై నూతన విదేశీ వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లి వీడియో ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా వైరల్‌గా మారడంతో ఇంటర్నెట్‌లో హంగామా మొదలైంది. భార‌త‌దేశ వైవిధ్యం, సంప్రదాయాలపై నెటిజన్లు గర్వం వ్యక్తం చేస్తూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే.. వార్ చేస్తూ ఇంకా పోరాడుతున్న రెండు దేశాలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి భారతదేశం మాత్రమే సాధ్యమని చెబుతూ ప్రజలు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement