రష్యా తలచుకుంటే ఐరోపాలోని రాజధాని నగరాలపై అణాయుధాలు ప్రయోగించి, కేవలం రెండు నుంచి 3 నిమిషాల్లో సరనాశనం చేయగలమని, మరోమాటలో చెప్పాలంటే భూమ్మీద ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్దతుదారులు హెచ్చరించారు. పారిస్, లండన్, బెర్లిన్ వంటి నగరాలతో సహా పశ్చిమ దేశాల ఆనవాళ్లు కూడా మిగలవని బెదరించారు. ఒకే ఒక సర్మత్ ఖండాంతర క్షిపణితో బ్రిటన్‌కు చెందిన ఐల్స్ అంతర్థానమవుతుందని అన్నారు. ఐరోపా దేశాలపై ఏ క్షణమైనా లేదా మే 9 నాటికి రష్యా అధ్యక్షుడు యుద్ధం ప్రకటించవచ్చని, ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయిలో దాడులు చేసే ప్రమాదం ఉందని, దానిని ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే ఐరోపా దేశాలు సిద్ధం కావాలని నాటో మాజీ చీఫ్ రిచర్డ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యాలో పేరుమోసిన ప్రభుత్వ అధికారిక చానల్ వన్‌లో గంట నిడివిగల చర్చా వేదికపై అణుయుద్ధం.. ప్రభావం అనే అంశంపై మాట్లాడిన పుతిన్ మద్దతుదారులు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. పైగా రష్యాలో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న ఈ చర్చాగోష్టి కార్యక్రమంలో రష్యా జాతీయవాద రోడినా పార్టీ చైర్మన్ అలెక్సే ఝురవ్ల్యోవ్, కార్యక్రమ నిర్వాహకులు రెచ్చిపోయి మాట్లాడారు.
సమ్రత్ సహా అనేక అణాయుధాలు మోసుకెళ్లగలిగే క్షిపణులు, ఎన్ని సెకన్లలో ఐరోపా దేశాల రాజధానులను ధ్వంసం చేయగలవో సూచించే మ్యాప్‌ను చూపిస్త్తూ తన అభిప్రాయాలను వెల్లడించారు. రష్యాను ఉగ్రవాద దేశంగా చూపిస్తూ, ఉక్రెయిన్‌కు పెద్దఎత్తున సైనిక సాయం, ఆయుధాలు సరఫరా చేస్తున్న బ్రిటన్‌పై అక్కసు వెళ్లగక్కారు. రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడులు చేయడాన్ని బ్రిటన్ రక్షణమంత్రి జేమ్స్ హీపే సమర్థించడాన్ని వీరు తప్పుబట్టారు. రష్యా కేవలం 3 నిమిషాల్లో అనుకున్న లక్ష్యాలను ఛేదించగలదని, అదే జరిగితే ఐరోపా నల్లటి పలకగా మారిపోతుందని అన్నారు. ఇదేదో బెదరించేందుకు చేస్తున్న వట్టిమాటలు కాదని, తేలికగా తీసుకోవద్దని చర్చాగోష్టిలో పాల్గొన్న నిర్వాహకులు, వ్యాఖ్యాతలు, అతిథులు హెచ్చరించారు. రష్యా అణుదాడికి పాల్పడితే బ్రిటన్ కూడా అణాయుధాలు ప్రయోగించి తీరుతుందని, ఈ యుద్ధంలో ఇక ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరని మరొకరు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు కొన్ని మ్యాప్‌లను వీక్షకులముందుంచారు. రష్యాలోని అణ్వాయుధ ప్రయోగ కేంద్రం కలినిన్గ్రాడ్నుంచి అణు క్షిపణులు ప్రయోగిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో వివరించారు.
బాల్టిక్ సముద్రం, పోలండ్, లిథువేనియా మధ్యలో ఉన్న ఈ వేదికనుంచి అణు క్షిపణులు ప్రయోగిస్తే కేవలం 106 సెకన్లలో జర్మనీ రాజధాని బెర్లిన్, 200 సెకన్లలో ఫ్రాన్స్ రాజధాని పారిస్, 202 సెకన్లలో బ్రిటన్ రాజధాని లండన్ తుత్తునియలవుతాయని వివరించారు. ప్రపంచంలో అత్యాధునిక దీర్ఘశ్రేణి ఖండాంతర క్షిపణి సర్మత్‌ను ఇటీవల ప్రయోగాత్మకంగా పరీక్షించిన పుతిన్ భూగోళంపై ఏ లక్ష్యాన్నయినా ఛేదించగలమని, శత్రువులు రష్యా జోలికి రావాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించిన విషయం తెలిసిందే. సర్మత్ పరీక్షల అనంతరం హైపర్ సోనిక్ క్షిపణులనూ రష్యా పరీక్షించింది. రష్యాలో అత్యంత ప్రజాదరణ ఉన్న ఈ చర్చాగోష్టి కార్యక్రమాన్ని ఓల్గా స్కబయేవ, ఎవజెని పొపోవ్ దంపతులు నిర్వహిస్తున్నారు. స్కబయేవా పుతిన్‌కు సన్నిహుతుడిగా చెబుతారు. ఐరన్ డాల్ ఆఫ్ పుతిన్‌గా ఆయనను అంతా పిలుస్తారు. వీరు ఇలా బెదరించారంటే, అది పుతిన్ మనసులోని మాటగానే రష్యన్లు భావిస్తారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..