Friday, November 22, 2024

భారంగా విదేశీ విద్య!

అంతర్జాతీయ పరిణామాలు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, రోజురోజుకు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం వెరసి డాలర్‌తో రూపాయి పతనంవంటి పరిణామాలు తీవ్ర ప్రభావంచూపిస్తు న్నాయి. ప్రత్యేకించి విదేశీ విద్యపై బాగా పడింది. ఫిబ్రవరి ఆఖరు వరకూ ఒక డాలర్‌ విలువ 75 రూపాయిలు కాగా, మార్చి నుంచి రూపాయి మారకం విలువ తగ్గడం ప్రారంభమైంది. ప్రస్తుతం డాలర్‌తో మారకం విలువ రూ.80లకు చేరింది. దీని వల్ల ఈ ఏడాది ఆగస్టు- డిసెంబర్‌ నెలల్లో మన దేశం నుంచి విదేశీ విద్యా లయాల్లో చేరేందుకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది.దీంతో విద్యార్ధుల తల్లితండ్రుల్లో ఆందోళన ప్రారంభమైంది. మరో వైపురూపాయి విలువను కాపా డేందుకు రిజర్వు బ్యాంకు చర్యలు చేపడుతున్నప్పటికీ సత్ఫలితాలు ఒనగూరడం లేదు. 1947లో డాలర్‌ విలువ రూపాయితో సమానంగా ఉండేది. గత 15 సంవత్సరాల కాలంలో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 46 శాతం తగ్గిపోయింది.ఇదే సమయం లో ఆస్ట్రేలియాలో డాలర్‌తో 26 శాతం, యూరోతో25 శాతం క్షీణించింది. రూపాయితోపోలిస్తే అమెరికా డాలర్‌ విలువ గణనీ యంగా పెరగడతో మన విద్యార్ధులకు విదేశీ చదువు పెనుభారంగా మారింది. అమెరికాకు వెళ్ళి ఉన్నత విద్యఅభ్యసించాలనుకునే విద్యార్ధుల కళాశాల రుసుములు, ఇతర ఖర్చులకోసం రూపాయల్లో మరింత అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది, మన దేశం నుంచి ఉన్నత విద్య కోసం ఎక్కువగా విద్యార్థులు వెళ్లేది అమెరికాకే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు సిద్ధపడుతున్నారు. విమాన చార్జీలకూ, ఇతర ఖర్చులకు పెద్దమొత్తం వెచ్చించాల్సి ఉంది. వైద్య విద్య పూర్తి చేసి అక్కడ రెసిడెన్సీ కోసం వెళ్ళే వారు దాదాపు వంద విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకుంటారు. ఇందుకు ఒక్కొక్క యూనివర్శిటీకి 30 డాలర్లు అవుతుంది. అయితే, విదేశాల్లోని కళాశాలల్లో ఫీజులు పెరిగినప్పటికీ మన రూపాయిల్లో ఎక్కువ చెల్లించాలి.

ఈ భారం మధ్యతరగతివారిపై ఎక్కువ పడనుంది. ఒకవైపు ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ పలుసార్లు వడ్డీరేట్లు పెంచేస్తూండటంతో విద్యారుణాలు మరింత భారంగా మారాయి. 2013లో డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ అధికారంలో ఉన్నప్పుడు రూపాయికి ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు రూపాయి పతనాన్ని నిరోధించలేకపోతున్నారని ఆనాడు ప్రతి పక్షంలో ఉన్న బీజేపీ విమర్శించింది. ఇప్పుడు ఏం సమాధానం చెెబుతుందో చూడాలి. జనవరి నుంచి రూపాయిని డాలర్‌తో పోలిస్తే విలువ దాదాపు ఆరు శాతం పతనమైంది. 2029నాటికి ఒక్కో యూఎస్‌ డాలర్‌ 94 నుంచి 95 రూపాయిల దాకా పలుక వచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. అదే జరిగితే మన ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది. రూపాయి పతనంతో భారతీయ విద్యార్థుల విదేశీ చదవులపై ఆశలు ఆవిరి అవుతున్నాయి. అయితే, విద్యార్ధులు భయపడాల్సి న అవసరం లేదనీ, అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విద్యార్ధులు కొద్దిగా ఖర్చు అధికమైనా సిద్ధం కావాలని కన్సల్టెన్సీ సంస్థలు సూచిస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం విదేశాల్లో మన విద్యార్థుల సంఖ్య13.24 లక్షలు. కాగా, వీరిలో 4.65 లక్షల మంది అమెరికాలోనే ఉన్నారు. రూపాయి పతనాన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ముందే తమ పిల్లల భవిష్యత్‌ గురించి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం అవసరం. ఒక క్రమపద్ధతిలో పొదుపు చేసుకుంటే భవిష్యత్‌ అవసరాలను సులభంగా తీర్చుకునే వీలు ఏర్పడుతుంది. ఈ పొదుపు అనేది వారి ఇష్టానుసారం బ్యాంకుల్లో కానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ లో కానీ మదుపు చేస్తే సులభతరమవు తుంది. కనుక అదనపు నిధుల కోసం ప్రత్యామ్నా మార్గాలు చూసుకుంటే విదేశీ విద్య సులభసాధ్యమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement