రష్యాలో సైనిక తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నెర్ గ్రూప్ ఎట్టకేలకు పుతిన్ సర్కారుతో రాజీకి వచ్చింది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న రోస్టోవ్ నగరాన్ని వదిలి దాని బేస్ కు దళాలను పిలిపించుకునేందుకు అంగీకరించింది. ఈమేరకు రష్యా తరఫున రాయబారం నడిపిన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోకు, వాగ్నెర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మధ్య డీల్ కుదిరింది. .
అనంతరం ఒక ఆడియో సందేశం విడుదల చేసిన యెవ్జెనీ ప్రిగోజిన్ .. “రష్యాలో రక్తపాతం జరిగే ముప్పు ఉన్నందున మా ఫైటర్లు తిరిగి మా స్థావరానికి వచ్చేస్తారు” అని ప్రకటించాడు. తిరుగుబాటుదారుల భద్రతకు రష్యా నుంచి బెలారస్ అధ్యక్షుడు హామీ ఇప్పించినందుకు ప్రతిఫలంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని యెవ్జెనీ ప్రిగోజిన్ వెల్లడించాడు. ఈ డీల్ లో భాగంగా యెవ్జెనీ ప్రిగోజిన్ పై ఉన్న అన్ని నేరారోపణలను తొలగించి.. దేశం విడిచి బెలారస్‌కు వెళ్లిపోయేందుకు సహకరిస్తామని రష్యా అంగీకరించింది. దీంతో కిరాయి సైన్యం వాగ్నెర్ గ్రూప్ , రష్యా ఆర్మీ మధ్య యుద్ధ మేఘాలు తాత్కాలికంగా తొలగిపోయాయి.
ఈ అంశాలపై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో, వాగ్నెర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మధ్య శనివారం రోజంతా చర్చలు జరిగాయని తెలుస్తోంది. రష్యాలోని రోస్టోవ్ నగరంలో ఉన్న సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ ప్రధాన కార్యాలయం నుంచే ఉక్రెయిన్ లోని రష్యా ఆర్మీకి ఆయుధాలు సప్లై అవుతుంటాయి. అందులో భారీగా ఆయుధాలు, మిస్సైళ్ళు, యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి. ఒకవేళ వాటిని వాగ్నెర్ గ్రూప్ కిరాయి సేనలు వాడటం మొదలుపెడితే రష్యాలో జనజీవనం స్తంభించే అవకాశం ఉంటుంది. అందుకే వాగ్నెర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ తో రాజీకి వచ్చేటందుకే పుతిన్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది