ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యా నగరం బెల్గోరడ్ చమురు డిపోలో శుక్రవారం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఆ ప్రాంత గవర్నర్ గ్లాడ్‌కోవ్ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో వెల్లడించారు. ”ఉక్రెయిన్ ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు చేసిన దాడి కారణంగా ఈ డిపోలో మంటలు అంటుకొన్నాయి. రష్యా భూభాగంలో తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఈ దాడి చేశాయి. ఎటువంటి ప్రాణనష్టం లేదు” అని పేర్కొన్నారు. అంతకు ముందు అదే ప్రాంతంలో ఉన్న ఆయుధ డిపోపై ఉక్రెయిన్ బలగాలు దాడిచేసి ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు గాయపడినట్లు గ్లాడ్‌కోవ్ పేర్కొన్నారు. డిపో చుట్టుపక్కల ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలను ఖాళీ చేయించినట్లు ఆయన వెల్లడించారు. మంటలను ఆర్పేందుకు అత్యవసర దళాలు అక్కడకు చేరుకొన్నాయి. ఈ ఘటనపై ఉక్రెయిన్ నుంచి ఎటువంటి ధ్రువీకరణ రాలేదు. సైనికదళాల ప్రజా సంబంధాల అధికారి బోధన్ సెన్‌యాక్ మాట్లాడుతూ తమ వద్ద ఎటువంటి సమాచారం లేదన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..