Friday, November 22, 2024

భార‌త్ పై ఆంక్ష‌లొద్దు..బైడెన్ కి సొంత పార్టీ నేత‌ల లేఖ‌..

అమెరికాతో భార‌త్ కి స‌త్సంబంధాలు ఉన్నాయ‌న్న సంగ‌తి తెలిసిందే. గ‌వ‌ర్న‌మెంట్ మారి ఆ దేశానికి ఏ అధ్య‌క్షుడు వ‌చ్చినా భార‌త్ కి స్నేహ హ‌స్తం చూపిస్తుంటారు. ప్రస్తుతం అమెరికాకి దేశాధ్య‌క్షుడు బైడెన్ అని తెలిసిన సంగ‌తే. అయితే భార‌త్ ప‌ట్ల ఆంక్ష‌లు విధించొద్ద‌ని సొంత‌పార్టీకి చెందిన నేత‌లే లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాలు చూస్తే.. రష్యా రూపొందించిన ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థను సిద్ధం చేసుకునే దేశాల మీద అమెరికా.. ‘కాట్సా’ చట్టాన్ని ప్రయోగిస్తుంది .

కాట్సా అంటే.. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ థ్రూ సాంక్షన్స్ చట్టం. దీని ప్రకారం అమెరికాకు విరోధి గా ఉండే దేశాల నుంచి అత్యాధునిక ఆయుధాల్ని కొనుగోలు చేయటం నిషిద్ధం. దీన్ని ఉల్లంఘించిన దేశాల మీద ఆంక్షలు విధిస్తారు. అమెరికాకు ..రష్యా విరోధి అన్న సంగతి తెలిసిందే . ఈ నేపథ్యం లో రష్యా నుంచి కొనుగోలు చేసే క్షిపణి వ్యవస్థను భారత్ కొంటే.. మన దేశం పై ఆంక్షలు విధించే వీలుంది. అయితే రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణులను కొనుగోలు చేయకుండా భారత్‌ పై ఆంక్షలు విధించవద్దని కోరుతూ అమెరికాలో ఇద్దరు కీలక సెనేటర్లు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. రష్యా నుంచి భారత్ క్షిపణుల కొనుగోలుకు అడ్డంకిగా మారే అవకాశం ఉన్న కౌంటరింగ్‌ అమెరికాస్‌ అడ్వర్సరీస్‌ థ్రూ సాంక్షన్స్‌ యాక్ట్‌ ఆంక్షల్ని భారత్‌ పై అమలు చేయొద్దని లేఖలో సెనెటర్లు కోరారు.

అంతేకాదు ఇది భారత్‌తో పాటు అమెరికా జాతీయ భద్రతకు కూడా సంబంధించిన అంశమని పేర్కొన్నారు. కాట్సా చట్టంలోని నిబంధనల ప్రకారం ఆంక్షల నుంచి మినహాయింపు నిచ్చే అధికారం అధ్యక్షుడికి ఉందని తెలిపారు. 2018లో భారత్‌ 540 కోట్ల డాలర్లతో ఎస్‌-400 క్షిపణులను కొనేందుకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.. అయితే అదే ఏడాది అమెరికా కాట్సా చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కాట్సా అనేది అమెరికా ప్రత్యర్థులపై ఆర్థిక ఆంక్షలను ప్రయోగించడానికి అధికారమిచ్చే చట్టం. అమెరికా దీని కింద రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియా రక్షణ ఉత్పత్తుల సంస్థలతో వ్యాపారం చేసే దేశాలపై ఆంక్షలు విధించవచ్చు. దీంతో ఎస్‌-400 క్షిపణి కొనుగోలుకు కాట్సా అడ్డు తగులుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సెనెటర్లు బైడైన్ కు ఈ లేఖ రాశారు. మ‌రి బైడెన్ ఏ నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఎదురు చూస్తున్నారంతా.

Advertisement

తాజా వార్తలు

Advertisement