మాస్కో: ఆసియాలో కీలకమైన రష్యా, ఇండియా, చైనా మధ్య త్వరలో త్రైపాక్షిక భేటీ జరిగే అవకాశాలున్నాయని క్రెమ్లిన్ అదికార ప్రతినిధి యూరి ఉషకోవ్ వెల్లడించారని అధికార వార్తా సంస్థ టాస్ పేర్కొంది. చైనా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఉందని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకున్నప్పుడు ఈ రష్యా, ఇండియా, చైనా (ఆర్ ఐ సీ – రిక్) కూటమి ప్రస్తావన వచ్చిందని యూరి ఉషకోవ్ చెప్పినట్లు తన కథనంలో వెల్లడించింది.
పుతిన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న యూరి ఉషకోవ్ ప్రస్తావించిన ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. మూడు దేశాల మధ్య పరస్పర సహకారమే లక్ష్యంగా భవిష్యత్ లో ఒకే వేదికపై చర్చలు జరిపేందుకు అవకాశం ఉందని యూరి అన్నట్లు టాస్ పేర్కొంది. జపాన్ లోని ఒసాకాలో 2019లో జి-20 సదస్సు సందర్భంగా ఈ మూడు దేశాలు భేటీ అయ్యాయి. షాంఘై సహకార సంస్థ తరహాలో ఆర్ ఐ సీ కూడా పరస్పర సహకారం, గౌరవం, పారదర్శకత, మూడు దేశాల ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునేలా అవగాహనకు వచ్చేందుకు ప్రత్యేకమైన అంతర్జాతీయ వేదిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.