Thursday, November 21, 2024

రష్యా చమురుపై మరిన్ని ఆంక్షలు : ఈయూ

బ్రస్సేల్స్‌, ప్ర‌భ‌న్యూస్ : ఉక్రేయన్‌పై దాడి సాగిస్తున్న రష్యా నుంచి చమురు దిగుమతులపై నిషేధం విధించాలని యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లోని 27 దేశాలకు యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వోన్‌డెర్‌ లె యెన్‌ పిలుపు ఇచ్చారు.అంతేకాకుండా రష్యాలోని అతి పెద్ద బ్యాంకు అయిన స్బెర్‌బ్యాంకు,మరో రెండు ప్రధాన బ్యాంకులను అంతర్జాతీయ బ్యాంకింగ్‌ పేమెంట్‌ వ్యవస్థ స్వి ఫ్ట్‌ నుంచి వేరు చేయాలని ఉర్సులా పిలుపు ఇచ్చారు. ఉర్సులా వోన్‌డెర్‌ లెయెన్‌ బుధవారం యూరోపియన్‌ పార్లమెంటు సమావేశంలో ప్రసంగిస్తూ,రష్యా నుంచి చమురు దిగుమతులను ఈయూ సభ్యదేశాలు దశలవారీగా నిలిపివేయాలని సూచించారు. ఈయూ సభ్యదేశాలు చమురు కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకోవల్సి ఉందనీ, దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై సాధ్యమైనంత తక్కువ ఉండేట్టు చూడాలని సూచించారు. అయితే, ఈ ప్రతిపాదనలను ఈయూ సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంది. దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది.

ఈయూలోని సభ్యదేశాల్లో కొన్ని చమురు అవసరాల కోసం పూర్తిగా రష్యా పై ఆధారపడి ఉన్న దృష్ట్యా ఈ ప్రతిపాదనలను అమలులోకి తేవడం అంత సులభం కాదన్న సంగతి తనకు తెలుసునని వోన్‌డెర్‌ లెయెన్‌ అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ఈయూ ఆంక్షలు విధించడం ఇది రెండవ సారి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కి నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోవడంతో ఆంక్షల విధింపునకు పిలుపు ఇచ్చినట్టు ఈయూ అధ్యక్షురాలు పేర్కొన్నారు. పుతిన్‌పైనా, ఆయన కుటుంబసభ్యులపైనా ఈయూ ఇదివరకే ఆంక్షలు విధించింది. రష్యా నుంచి బొగ్గు దిగుమతులను కూడా నిషేధించింది.
హంగేరీ, స్లావాకియాల అభ్యంతరం: రష్యాపై ఆంక్షలు విధించేందుకు హంగేరీ,స్లావాకియాలు అభ్యంతరం తెలిపాయి.ఇందుకు అవి కారణాలు తెలపలేదు.అదే మాదిరిగా ఆ రెండు దేశాలకు మినహాయింపు ఇస్తారా లేదా అనేవిషయాన్ని ఈయూ అధ్యక్షురాలు వోనెడెర్‌ లెయెన్‌ స్పష్టం చేయలేదు. కీవ్‌ శివారులోని బూచాలో మారణహోమానికీ, మారణ కాండకు బాధ్యులైన ఆర్మీ అధికారులనూ,ఇతర సైనికులను లక్ష్యంగా చేసుకోవాలని ఈయూ దేశాలకు లెయెన్‌ పిలుపు ఇచ్చారు.

బుచాలో రష్యన్‌ దళాలు పౌరులను లక్ష్యంగా చేసుకుని దారుణంగా వ్యవహరించారనీ, వారి చర్యలకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారనీ ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు.మానవాళి పట్ల అపరాథానికి పాల్పడినవారు తప్పించుకోలేరి లెయెన్‌ అన్నారు. కాగా, రష్యాలోని స్బెర్‌ బ్యాంకు రష్యాలోని బ్యాంకింగ్‌ రంగంలో 37 శాతం వాటాలను కలిగి ఉంది.ఈ బ్యాంకును స్విఫ్ట్‌ నుంచి వేరు చేయడం వల్ల రష్యాలో ఆర్థిక పరిస్థితి గందరగోళంలో పడే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్‌లో ప్రస్తుత యుద్ధం గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేవారిని కూడా వదిలిపెట్టబోమని వోనెడెర్‌ లెయన్‌ హెచ్చరించారు.టెలివిజన్‌ చానల్స్‌ పుతిన్‌ బాకాల్లా తయారయ్యాయని ఆమె ఆరోపించారు.అబద్దాలను ప్రసారం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు.అయితే,ఆ చానల్స్‌ పేర్లను ఆమె వెల్లడించలేదు.ఉక్రెయిన్‌పై రష్యా దాడి అమానుషమనీ,ఈ యుద్ధంలో రష్యాఓటమి ఖాయమనీ,ఇప్పటికే ఇందుకు పలు సంకేతాలు వెలువడ్డాయని ఆమె అన్నారు.ఈ ఏడాది చివరి నాటికి ఉక్రెయిన్‌ ఆర్థికపరిస్థితి చాలా దారుణంగా తయారు కాగలదనీ, ఇందుకు కోసం ఈయూ దేశాలు సాయం అందించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement