Tuesday, November 26, 2024

విక్టరీ డే ఉత్సవాలు ముగిసిన వెంటనే చెలరేగిన రష్యా..

కీవ్ : రెండో ప్రపంచయుద్ధంలో విజయానికి సంకేతంగా సోమవారంనాడు విజయోత్సవాలు నిర్వహించిన రష్యా మంగళవారం ఉదయాన్నే ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మరం చేసింది. ప్రత్యేకించి నల్లసముద్ర తీరంలోని పోర్టుసిటీ ఒడెశాపై నిప్పులుకక్కింది. ధనికన్నా వేగంగా దూసుకువచ్చే హైపర్‌సోనిక్‌ క్షిపణలతో దాడికి దిగింది. ఏకంగా ఏడు క్షిపణులు నగరంలోని భవనాలు, గొడౌన్లను ద్వంసం చేశాయి. రష్యా ప్రయోగించినవాటిలో కింఝాల్‌, డాగర్‌ క్షిపణులున్నాయని ఉక్రెయిన్‌ రక్షణ బలగాలు ప్రకటించాయి. వీటిలో కింఝాల్‌ క్షిపణి 2000 కి.మి దూరంలోని లక్ష్యాలను చేధిస్తాయి. ధనికన్నా ఐదురెట్ల వేగంగా దూసుకువెళ్లే ఈ క్షిపణులను రష్యా ఉక్రెయిన్‌ గగనతలంలోకి రాకుండానే ప్రయోగించడం గమనార్హం. ఇప్పటికో పోర్ట్‌ సిటీ మరియపోల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా ఇప్పుడు మరో నౌకానగరం ఒడెశాపై కన్నేసింది. మరియపోల్‌ పారిశ్రామిక ఉత్పత్తులు, ఆయుధాలు దిగుమతికి కేంద్రంగా ఉండగా ఒడేశా వ్యవసాయ, ఆహార పదార్థాల దిగుమతికి కేంద్రంగా ఉంది. పశ్చిమ దేశాలనుంచి అవేవీ అందకుండా ఉక్కిరిబిక్కిరి చేసేందుకు రష్యా పోర్టు సిటీలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

తాజా దాడుల్లో కనీసం ఒకరు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. మరోవైపు ఖార్కీవ్‌కు 120 కి.మి. దూరంలోని లిజమ్‌ నగరంలో గతనెల రష్యా కూల్చివేసిన ఒక భవనం శిథిలాల కింద 44 మృతదేహాలు లభ్యమైనాయి. మార్చి మొదటివారంలో రష్యా క్షిపణిని ప్రయోగించడంతో ఐదంతస్తుల భవనం కూలిపోయింది. కాగా రష్యా స్వాధీనం చేసుకున్న మరో పోర్ట్‌సిటీ మరియపోల్‌లోని స్టీల్‌ప్లాంట్‌లో మోహరించిన ఉక్రెయిన్‌ సైనికులనుంచి ఇంకా ప్రతిఘటన కొనసాగుతోంది. కాగా ఆ కర్మాగారంలో చిక్కుకుపోయినవారిని ఇప్పటికే తరలించారు. అయితే, మరో వందమంది ఇంకా అక్కడే చిక్కుకుపోయారని గుర్తించారు. వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభమైనాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement