Friday, November 22, 2024

రష్యా కాల్పుల విరమణ, విదేశీయుల తరలింపునకు అవకాశం.. ఐదున్నర గంటల పాటు అవకాశం

వారానికి పైగా ఉక్రెయిన్‌లో ఏకధాటిగా దాడులకు పాల్పడిన రష్యా శనివారం ఉదయం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాల ఒత్తిడితో ఉక్రెయిన్‌లో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఉక్రెయిన్‌లో ఉదయం 11.30 నుంచి కాల్పులు విరమించినట్టు రష్యా తెలిపింది. మానవతాదృక్పథంతో కాల్పుల విరమణిస్తున్నట్టు రష్యా వెల్లడించింది. ప్రపంచ దేశాలు ఎంతగా వారించినా.. ఏమాత్రం వెనక్కి తగ్గని అధ్యక్షుడు పుతిన్‌ మానవతా దృక్పథంతో వెనక్కి తగ్గాడు. యుద్ధం చేయడమే కాదు.. సానుభూతి చూపడం కూడా తమకు తెలుసు అని రష్యా ఈ చర్యతో ప్రకటించుకుంది. తమకు కూడా మనసు ఉందని పుతిన్‌ ఈ కీలక నిర్ణయంతో నిరూపించుకున్నాడు.విదేశీయులను ఉక్రెయిన్‌ నుంచి తరలించేందుకు ఐదున్నర గంటల పాటు యుద్ధానికి తాత్కాలిక విరామాన్ని ప్రకటించినట్టు రష్యా ప్రతినిధి మీడియాకు వెల్లడించాడు. కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

యుద్ధ క్షేత్రంలో సామాన్యులు దేశం దాటేందుకు వీలుగా కాల్పుల విరమణకు అంగీకరించినట్టు తెలిపింది. యుద్ధాన్ని ప్రారంభించిన 10వ రోజు కాల్పుల విరమణను ప్రకటించింది. యుద్ధంలో సామాన్యులు బలికాకుండా ఉండేందుకు కాల్పుల విరమణను ప్రకటించినట్టు రష్యా స్థానిక మీడియా వెల్లడించింది. మరియుపోల్‌, వోల్నోవఖా ప్రాంతాల్లో కాల్పులను విరమించినట్టు ప్రకటించింది. భారతీయులు ఎక్కువగా లేని ప్రాంతాల్లోనే కాల్పులను విరమించింది. సుమీలో కాల్పుల విరమణను భారత్‌ కోరింది. రష్యా ప్రకటించిన నగరాలతో భారతీయులకు ప్రయోజనం శూన్యంగా కనిపిస్తున్నది. రెండో విడత చర్చలో కుదిరిన ఒప్పందం ప్రకారం.. వోల్నోవఖా ప్రాంతంలో మరో సివిల్‌ కారిడార్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపింది.

రష్యా ప్రకటనతో ఉక్రెయిన్‌తో పాటు విదేశీయులకు భారీ ఊరట కలిగినట్టే చెప్పొచ్చు. యుద్ధ సమయంలో దేశ సరిహద్దులను దాటడంలో భారతీయులు సహా ఇతర విదేశీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ స్వదేశానికి వెళ్లాలనుకునేవారంతా ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో నుంచి సురక్షితంగా వెళ్లిపోయేందుకు వీలుపడింది. కాల్పుల విరమణ సమయం దాటిన అనంతరం రష్యా మళ్లి కాల్పులను ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం మరియుపోల్‌ నుంచి 2లక్షల మంది, వోల్నోవాఖా నుంచి 20వేల మంది పౌరులను తరలిస్తున్నారు. ఈ రెండు నగరాలు ప్రస్తుతం ఉక్రెయిన్‌ వేర్పాటువాదుల దిగ్బంధంలో ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇప్పటి వరకు 1,60,000 మంది నిరాశ్రయులుగా మారారని ఐక్యరాజ్య సమితి శరణార్థి ఏజెన్సీ ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement