Saturday, November 23, 2024

రష్యా దూకుడు.. కీవ్‌ విలవిల – క్షిపణులు, రాకెట్లతో ముప్పేట దాడులు

కీవ్‌:డోన్‌బాస్‌ రీజియన్‌లో దూసుకుపోతున్న రష్యా ఆదివారంనాడు మరింత దూకుడుగా వ్యవహరించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాల్లో క్షిపణులు, రాకెట్లతో విరుచుకుపడింది. పుతిన్‌ సేనల ముప్పేట దాడులతో ఉక్రెయిన్‌ విలవిలలాడింది. భారీగా నష్టపోయింది. ఉక్రెయిన్‌లోని నాల్గవ అతిపెద్ద పట్టణం ద్నిప్రోకు సమీపంలోని సైనిక స్థావరంలో రక్షణశాఖకు చెందిన అధికారులు సమావేశమైన సమయంలో కాలిబర్‌ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో 50మంది మరణించారని, వీరిలో పెద్ద సంఖ్యలో సైనిక జనరల్స్‌, రక్షణశాఖ ఉన్నతాధికారులు ఉన్నారని రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి ఇగోర్‌ కొనషెన్‌కోవ్‌ ప్రకటించారు. అలాగే ఖార్కీవ్‌లోని ఉక్రెయిన్‌ దళాలపై ఇస్కందర్‌ క్షిపణులతో దాడులు చేశామని, అక్కడి మున్సిపల్‌ భవనం సహా అనేక నిర్మాణాలు కుప్పకూలాయని, యుద్ధట్యాంకుల మరమ్మతుల కేంద్రం ధ్వంసమైందని, మికోలెయ్‌వ్‌లో జరిపిన క్షిపణి దాడుల్లో 10 హోవిడ్జర్‌ శతఘ్నులు, 20 మిలటరీ వాహనాలు దగ్ధమైనాయని వెల్లడించారు.

మరోవైపు లిజిమ్‌, సీవీరోడోనెట్‌స్కీ, మెటోల్‌కిన్‌ ప్రాంతాల్లో రష్యా దాడులు విస్తృతం చేసింది. డోన్‌బాస్‌ రీజియన్‌లోని లుషాంక్‌ ప్రాంతంలో ఫిరంగిదళాలతో విరుచుకపడింది. దాదాపు నాలుగువారాలుగా సీవీరోడోనెట్‌స్కీ ప్రాంతంలో రష్యా పై చేయి సాధించినప్పటికీ ఉక్రెయిన్‌ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఇంకా కొంత ప్రాంతంపై అవి పట్టు సడలించలేదు. దీంతో రష్యా తీవ్రాతితీవ్రంగా ప్రయత్నిస్తోంది. మిగతా ప్రాంతాల్లోనే సైన్యాన్ని సీవీరోడెనెట్‌స్కీ ప్రాంతానికి తరలిస్తోంది. మరో పట్టణం నోవోమోస్కోవ్‌లో ఓ చమురు డిపోను పేల్చివేయగా ఒకరు మరణించారు. నిజానికి ఈ ప్రాంతంలో శనివారంనాడు రష్యాకు చెందిన యుద్ధ ట్యాంకులను, వాహనాలను ఉక్రెయిన్‌ సేనలు పేల్చివేశాయి. కాగా ఆదివారంనాడు రష్యా రెచ్చపోయింది. కాగా మెటోల్‌కిన్‌లో రష్యా కాస్త పై చేయి సాధించిందని, అంతమాత్రాన తామేమీ లొంగిపోలేదని ఉక్రెయిన్‌ ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement