Tuesday, November 19, 2024

పల్లె ప్రగతి హామీల అమలు చేపట్టాలి.. స్త్రీ నిధి ద్వారా ఇంటింటికీ సోలార్ : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, పనులను వెంటనే చేపట్టాలని అధికారులకు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆదేశించారు. కొత్త సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ కొత్త భవనాల నిర్మాణాలను మొదలు పెట్టాలని ఆయన సూచించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు పూర్తి అయిన వెంటనే బిల్లులను చెల్లించాలన్నారు. పురోగతిలో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమావేశమై ఐదో విడత పల్లెప్రగతితో పాటు ఆయా శాఖల్లో నిర్వహిస్తున్న పలు పనుల పురోగతిపై సమీక్షించారు.

అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పల్లె ప్రగతి సందర్భంగా ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు, గ్రామాల అవసరాలకు సంబంధించిన హామీలను పరిశీలించి, ప్రాధాన్యత ప్రాతిపధికన వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో విజయవంతంగా నడుస్తోన్న ఇంటింటికీ సోలార్‌ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తం చేయాలని, జిల్లాకు వెయ్యిమంది లబ్ధిదారులకు ఈ ప్రాజెక్టు అందేలా చూడాలన్నారు.

స్త్రీనిధి రుణాల ద్వారా ఇంటింటికీ సోలార్‌ ప్రాజెక్టు వలన విద్యుత్‌ ఆదా అవుతుందన్నారు. మహిళా గ్రూపులకు కుట్టు శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా పాలకుర్తి నియోజవర్గంలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. డ్వాక్రా గ్రూపుల ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అమ్మేందుకు ఒప్పందం పూర్తి చేయాలని ఆధికారులకు సూచించారు. గతంలో నిర్ణయించిన విధంగా స్త్రీ నిధి వేతన పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement