Tuesday, November 26, 2024

రూపాయి నీకేమైంది, జీవిత కాల కనిష్టానికి కరెన్సీ.. వెంటాడుతున్న యుద్ధ భయాలు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం భారత్‌ కరెన్సీ రూపాయిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం మరింత తీవ్రమైతే.. రూపాయి విలువ ఇంకాస్త పతనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితులు సానుకూలంగా లేకుంటే.. డాలర్‌ మారకంతో రూపాయి విలువ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 80ని తాకినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఏడాదిలోనే 77.93 డాలర్లకు చేరుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు ఏమాత్రం సానుకూలంగా లేకపోయినా.. 82కు చేరినా చేరవచ్చు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో.. రష్యన్‌ రూబుల్‌ కూడా భారీగా క్షీణిస్తోంది. అమెరికా, యూరోపియన్‌ దేశాల ఆంక్షలు, స్విఫ్ట్‌ నుంచి తొలగింపు వంటి ఆంశాలు రూబుల్‌ క్రితం సెషన్‌లో పది శాతానికి పైగా నష్టపోవడానికి కారణమైంది. అయితే నేడు మాత్రం కాస్త పుంజుకుంది. అంతేకాదు.. వ్లాదిమిర్‌ పుతిన్‌ తన దేశంలోని కంపెనీలకు ఓ సూచన చేశారు. ఫారెన్‌ క్రెడిటర్స్‌కు రూబుల్స్‌లో చెల్లింపులు జరపొచ్చని తెలిపారు. ఈ పరిణామాలు కాస్త సానుకూలంగా మారాయి.

క్షీణిస్తున్న రూపాయి విలువ..

యుద్ధ ప్రభావం కారణంగా సోమవారం 77.44ని తాకి ఆల్‌టైం కనిష్టానికి పడిపోయింది. నేడు కాస్త పుంజుకుంది. ఉదయం 12 గంటల సమయానికి 76.88 వద్ద ట్రేడ్‌ అయ్యింది. రూపాయి విలువ క్షీణిస్తే.. దిగుమతి వ్యయాలు పెరుగుతాయి. చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నందున.. ధరలు పెరిగే అవకాశం ఉంది. రవాణా భారంగా మారి.. వివిధ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. అయితే ఐటీ కంపెనీలకు మాత్రం డాలర్ల రూపంలో కాస్త ప్రయోజనం ఉంటుంది. ఇలాగే యుద్ధం కొనసాగితే.. డాలర్‌ మారకంతో రూపాయి త్వరలోనే 80కు చేరుకునే ప్రమాదం లేకపోలేదని వివిధ బ్రోకరేజీ సంస్థలు అంంచనా వేస్తున్నాయి. కొన్ని బ్రోకరేజీలు 80 నుంచి 82కు చేరుకోవచ్చని హెచ్చరిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement