Wednesday, November 20, 2024

జీవితకాల కనిష్టానికి రూపీ, 2 నెలల్లో 3.5 శాతం క్షీణత.. 76.90ను తాకిన రూపాయి

రూపాయి విలువ సోమవారం జీవితకాల కనిష్టానికి పతనమైంది. ఉక్రెయిన్‌-రష్యా మధ్య నెలకొన్న యుద్ధంతో పాటు భారీగా పెరుగుతున్న ముడి చమురు ధరలు రూపాయి విలువను క్షీణింపజేశాయి. బాండ్లు, స్టాక్స్‌ ధరలు కూడా ప్రభావం చూపాయి. దీంతో రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. సోమవారం దాదాపు 1 శాతం మేర నష్టపోయిన రూపాయి.. డాలర్‌తో పోలిస్తే.. మారకం విలువ రూ.76.96 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు 76.90 జీవితకాల కనిష్టంగా కొనసాగింది. చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దిగుమతుల బిల్లు గణనీయంగా పెరగనుంది. దీంతో మారకపు నిల్వలు తరిగిపోనున్నాయి. ఇది రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపనుంది. 2022 క్యాలెండర్‌ ఏడాదిలోనే 3.5 శాతం క్షీణించింది. రష్యా రూబుల్‌ సహా వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు డాలర్‌తో పోలిస్తే.. పతనం అవుతున్నాయి.

ఐటీ కంపెనీలకు లాభాలు..

సోమవారం డాలర్‌తో పోలిస్తే.. రూపాయి 76.94 వద్ద ప్రారంభమైంది. ఓ సమయంలో 77ను కూడా దాటింది. 77.02 కనిష్టాన్ని నమోదు చేసింది. రూపాయి విలువ క్షీణిస్తే.. దిగుమతి వ్యయాలు భారీగా పెరుగుతాయి. భారత్‌ ఎక్కువగా ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. అందుకే దేశీయంగా పెట్రోల్‌, డీజెల్‌ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇది ఆహార పదార్థాలపై కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే నిత్యావసర ధరలకు ఆజ్యం పోసే రవాణా ధరలు పెరుగుతాయి. ఇక విదేశీ విద్య కూడా ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. విదేశీ ప్రయాణాలు మరింత ప్రియం అవుతాయి. లాభం ఏమిటంటే.. ఎగుమతిదారులు లాభపడుతారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు దీని వల్ల డాలర్ల రూపేణ ఎక్కువ ప్రయోజనం పొందుతాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement