Friday, November 22, 2024

అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి.. ఎస్‌బీఐ నివేదిక

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అమెరికా, ఐరోపా సహా వివిధ దేశాలు మాస్కోపైన ఆంక్షలు విధించాయి. ఐరోపా దేశాలు స్విప్ట్ నుంచి తొలగించాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా, ఐరోపా ఆంక్షల కారణంగా రష్యా వివిధ దేశాలతో నేరుగా ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధపడింది. ఈ పరిణామం భారత్‌కు లాభించనుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను అధిగమించేందుకు రూపాయి రూబుల్‌ లేదా రూబుల్‌ యువాన్‌ వాణిజ్యాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇది భారత కరెన్సీ అంతర్జాతీయీకరణకు అవకాశంగా మారుతుందని ఎస్బీఐ నివేదిక తెలిపింది. ఇప్పటికే డాలర్‌కు ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచం అన్వేషిస్తోందని, రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారడానికి ఇది సరైన సమయమని ఈ నివేదిక తెలిపింది.
రూబుల్‌ రూపాయి, రూబుల్‌ యువాన్‌ అంతర్జాతీయీకరణ అంటే ఒక కరెన్సీని ఈజీగా ట్రాన్సాక్షన్‌ చేయవచ్చు. ప్రపంచ వాణిజ్యం కోసం రిజర్వ్‌ కరెన్సీగా ఉపయోగించవచ్చు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే అమెరికా కరెన్సీ డాలర్‌ ఆధిపత్యం మరికొన్ని దశాబ్దాల పాటు కొనసాగవచ్చు. అయితే పలుదేశాలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంతో చెల్లింపులు చేసే అంశాన్ని కూడా కొంతమంది ప్రతిపాదిస్తున్నట్లు ఎస్బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌ తెలిపారు.

స్విప్ట్ పేమెంట్‌ సిస్టం నుండి తొలగించడంతో రష్యా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రష్యా డిప్యూటీ ప్రధానమంత్రి అలెగ్జాండర్‌ నొవాక్‌ గత వారంలో భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరితో మాట్లాడారు. భారత్‌కు ముడిచమురును డిస్కౌంట్‌ పైన అధికంగా ఇస్తామని ప్రతిపాదించారు. రష్యా చమురు సంస్థలు ఎంతో తక్కువ ధరకు చమురు ఇచ్చేందుకు సిద్ధమన్నారు. ఇలాంటి కాంట్రాక్ట్స్‌కు డాలర్లలో కాకుండా రూపాయి రూబుల్‌ పద్ధతిన చెల్లింపులు చేసే ప్రతిపాదన ఇరుపక్షాల పరిశీలనలో ఉందని తెలుస్తోంది. అయితే రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా వినియోగిస్తే ఇబ్బందులు కూడా లేకపోలేదు. ద్రవ్య పరపతి విధానం సంక్లిష్టమవుతుంది. అయితే అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్‌ వ్యయం మాత్రం తగ్గుతుందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement